ఇప్పుడు నిర్మాత అశ్వనీదత్ పంట పండింది. తన ఇంట్లోనే ఓ టాప్ డైరక్టర్ వున్నాడు. డైరక్టర్లను పట్టుకుని, హీరోల చుట్టూ తిరిగే పని లేదు. శక్తి సినిమా తరువాత అశ్వనీదత్ ను పిలిచి సినిమా ఇచ్చిన హీరో లేడు.
ఆయన ఎంత మందికి ఎన్ని భారీ సినిమాలు తీసి పెట్టాడో తెలిసిందే. కానీ ఒక్కరంటే ఒక్క హీరో కూడా డేట్ లు ఇస్తాం, సినిమా చేసుకోండి అనలేదు.
ఇప్పుడు మహానటి తరువాత నాగ్ అశ్విన్ స్టామినా తెలిసింది. అందుకే ఇక దత్తుగారికి సినిమాల సమస్య లేదు. ఏడాదికో సినిమా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి రుమాలు వేసేసినట్లు కనిపిస్తోంది. ఈరోజు మెగాస్టార్ మీడియాతో మాట్లాడారు మహానటి సినిమా మీద.
ఈ సందర్భంగా జస్ట్ క్యాజువల్ గా తాను నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి రెడీ అని మెగాస్టారూ, తాను ఆయన కోసం కథ రెడీ చేస్తున్నా అని నాగ్ అశ్విన్, ఆ సినిమాను తమ సంస్థే నిర్మిస్తుందని అశ్వనీదత్ చెప్పేసారు. ఇక ఇది కాస్త సీరియస్ గా మారితే, మెగాస్టార్ 152వ సినిమా వైజయంతీ బ్యానర్ లో రెడీ అవుతుంది అన్నమాట.