మెగాస్టార్‌ ‘కత్తి’ లాంటి రాజకీయం.!

మెగాస్టార్‌ చిరంజీవి 'కత్తి'లాంటి రాజకీయం షురూ చేశారట. టాలీవుడ్‌ సర్కిల్స్‌లో విన్పిస్తోన్న గాసిప్‌ ఇది. రాజకీయాలతో సంబంధం లేకుండా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని దర్శకుడు వినాయక్‌ ముందుగా ప్లాన్‌ చేశాడు. వాస్తవానికి తమిళ 'కత్తి'లో…

మెగాస్టార్‌ చిరంజీవి 'కత్తి'లాంటి రాజకీయం షురూ చేశారట. టాలీవుడ్‌ సర్కిల్స్‌లో విన్పిస్తోన్న గాసిప్‌ ఇది. రాజకీయాలతో సంబంధం లేకుండా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని దర్శకుడు వినాయక్‌ ముందుగా ప్లాన్‌ చేశాడు. వాస్తవానికి తమిళ 'కత్తి'లో పొలిటికల్‌ టచ్‌ వున్న కథాంశమే కనిపిస్తుంది. అయినా, అది జస్ట్‌ ఓ మెసేజ్‌ ఇచ్చే కమర్షియల్‌ సినిమా అంతే. దానికి ఇప్పుడు ఇంకాస్త పొలిటికల్‌ హంగులు అమర్చే పనిలో పడ్డారట. దాంతొ 'కిచిడీ' అయిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

'కత్తి' రీమేక్‌కీ రాజకీయాలకీ సంబంధమేమీ వుండదని మొదట్లో వినాయక్‌ చెప్పాడు. అయితే అసలు కథకి సంబంధించి మార్పులు చేర్పులు.. అన్నీ చిరంజీవి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇక్కడే చిరంజీవికీ, వినాయక్‌కీ మధ్య 'గ్యాప్‌' పెరిగిందన్న గాసిప్స్‌ తెరపైకొచ్చాయి. అయితే ఈ గాసిప్స్‌ని ఇంతవరకు సినిమా టీమ్‌ నుంచి ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. 

మొన్నామధ్య సినిమా షూటింగ్‌ అర్ధాంతరంగా ఆగిపోయిందనే గాసిప్స్‌ వచ్చాయి. కథలో మార్పుల కోసం బుర్రా సాయిమాధవ్‌ని రంగంలోకి దించారనే వార్తలూ వెలుగు చూశాయి. ఈ మార్పులు చేర్పులు.. ఏవైనాసరే, సినిమా బాగా రావడానికేనంటూ మెగా కాంపౌండ్‌ నుంచి ఓ 'లీక్‌' బయటకు వచ్చింది. ఉద్దేశ్యం ఏదైనా, ఇక్కడ వినాయక్‌ నలిగిపోతున్నాడన్న గాసిప్స్‌కే క్లారిటీ రావడంలేదు. 

అన్నయ్య మీద అభిమానం.. ఆల్రెడీ అన్నయ్యతో 'ఠాగూర్‌' సినిమాని చేసి హిట్‌ కొట్టిన వైనం.. ఆ సినిమా టైమ్‌లోనూ చిరంజీవి సూచించిన అనేక మార్పులకి 'ఓకే' చెప్పేశాడు వినాయక్‌. అలా ఆ సినిమా హిట్టయ్యింది కూడా. సో, ఆ అనుభవంతో వినాయక్‌ చాలా విషయాల్లో కాంప్రమైజ్‌ అవక తప్పడంలేదు. అయితే, పొలిటికల్‌గా సినిమాకి కొత్త కలర్‌ అద్దితే దాని ఔట్‌ పుట్‌ ఎలా వుంటుందన్న టెన్షన్‌ వినాయక్‌ని లోలోపల వెంటాడేందుకు ఆస్కారం లేకపోలేదు. 

ఏదిఏమైనా, చిరంజీవి కొత్త సినిమా పట్టాలెక్కేముందు ఎంతగా ఈ సినిమా గురించి ఊహాగానాలు విన్పించాయో, రీమేక్‌ సినిమా అయినా, సినిమా నిర్మాణంలోనూ అంతే రేంజ్‌లో ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇది మెగా మేనియా అనుకోవచ్చా.?