సినిమాలు క్లిక్… శాటిలైట్ నిల్..!

ఫ్లాప్ అయిన సినిమాలకు ఎలాగూ శాటిలైట్ మార్కెట్ ఉండదు. మరీ వెంటపడితే ఈ టీవీ ఛానెల్స్ చింతపండు బేరం ఆడతాయనే విషయం నిర్మాతలకు కూడా తెలుసు. కానీ ఈసారి పరిస్థితి మరింత విచిత్రంగా తయారైంది.…

ఫ్లాప్ అయిన సినిమాలకు ఎలాగూ శాటిలైట్ మార్కెట్ ఉండదు. మరీ వెంటపడితే ఈ టీవీ ఛానెల్స్ చింతపండు బేరం ఆడతాయనే విషయం నిర్మాతలకు కూడా తెలుసు. కానీ ఈసారి పరిస్థితి మరింత విచిత్రంగా తయారైంది. ఓ మోస్తరుగా క్లిక్ అయిన సినిమాలతో పాటు కొన్ని హిట్ మూవీస్ కు కూడా శాటిలైట్ కంప్లీట్ అవ్వకపోవడం దారుణం. ఈ విషయంలో ఒక్కో సినిమాది ఒక్కో బాధ.

ఆర్ఎక్స్100… సెన్సేషనల్ హిట్ ఇది. ఎవరూ కాదనలేని నిజం. రూపాయికి 5 రూపాయల లాభం వచ్చింది. ఇప్పుడీ సినిమా శాటిలైట్ డీల్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సినిమా ఇంత పెద్ద హిట్ అయినప్పటికీ టీవీ ఛానెళ్లు దీనివైపు కన్నెత్తి చూడడంలేదు. దీనికి కారణం ఇందులో ఉన్న అడల్ట్ కంటెంట్.

సినిమా ఎంత బాగున్నప్పటికీ టీవీకి ఈ కంటెంట్ పనికిరాదు. టీవీ కోసం ప్రత్యేకంగా సెన్సార్ చేయించాల్సి వచ్చినప్పుడు ఈ సన్నివేశాలన్నీ లేపేయాల్సి వస్తుంది. గతంలో అర్జున్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. సో.. ఆర్ఎక్స్-100కు బుల్లితెరపై ఎలాంటి బజ్ ఉండదు. అందుకే ఛానెల్స్ ఈ మూవీని పట్టించుకోవడం లేదు. 

మరోవైపు గూఢచారిది కూడా ఇదే పరిస్థితి. థియేటర్లలో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. సినిమా చూసిన జనాలంతా బాగుందన్నారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి. కానీ ఈ సినిమాను ఇప్పటివరకు ఏ ఛానెల్ కొనలేదు. దీనికి రెండు కారణాలున్నాయి. వీటిలో ఒకటి గూఢచారిలో స్టార్ వాల్యూ లేకపోవడం. పైగా ఇలాంటి స్పై-థ్రిల్లర్ సినిమాలకు టీవీల్లో రిపీట్ ఆడియన్స్ ఉండరు. సస్పెన్స్ ఏంటనేది ఒక్కసారి తెలిసిన తర్వాత టీవీల్లో మళ్లీ మళ్లీ చూడ్డానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించరు. 

మరోవైపు నిర్మాత అభిషేక్ నామా భారీగా రేటు చెప్పడం కూడా గూఢచారిని శాటిలైట్ విషయంలో వెనక్కినెట్టింది. సాక్ష్యం సినిమా ద్వారా వచ్చిన నష్టాల్ని అంతోఇంతో భర్తీ చేసుకోవాలనేది అభిషేక్ నామా ఆశ. కానీ గూఢచారితో నామా కోరిక తీరేలాలేదు. అలా హిట్ అయినా శాటిలైట్ కు నోచుకోలేకపోయింది ఈ సినిమా.

రీసెంట్ గా వచ్చి ఓ మోస్తరుగా ఆకట్టుకున్న చిలసౌ సినిమా కూడా శాటిలైట్ డీల్ పూర్తిచేసుకోలేకపోయింది. అన్నపూర్ణ స్టుడియోస్ టేకోవర్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ రన్ కూడా దాదాపుగా ముగిసింది. ఇంకా ఆలస్యమైతే శాటిలైట్ రేటు మరింత పడిపోతుంది. అందుకే కాస్త తగ్గి రేపోమాపో ఈ మూవీని 
ఎలాగోలా సెటిల్ చేసేయాలని చూస్తున్నారు. 

మొన్నటివరకు సమ్మోహనం సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉండేది. ఎవరూ తీసుకోకపోవడంతో, ఇంకా ఆలస్యమైతే ప్రమాదమని భావించి, పాత పరిచయాలు వాడి కిందామీద పడి రామోజీరావుకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మేశారు. కాస్తో కూస్తో క్లిక్ అయిన సినిమాల పరిస్థితే ఇలా ఉంటే, ఫ్లాప్ అయిన చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండిక.