టాలీవుడ్ సమ్మె వివాదం ముదురుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమ్మెవ్యవహారం లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లినట్లు వినికిడి. దాంతో ముందు పనుల్లోకి వెళ్లమని, అదేసమయంలో చర్చలు సాగించుకోవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. కానీ దానికి యూనియన్లు ససేమిరా అన్నట్లు బోగట్టా. అలా అయితే ఇక చర్చలెందుకుని నిర్మాతల మండలి బిగుసుకున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం డిమాండ్ మేరకు వేతనాలు ఇవ్వడానికి రెడీ అని, కానీ రెండు నిబంధనలు వుండాలని నిర్మాతల మండలి అడుగుతున్నారని తెలుస్తోంది. ఒకటి దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా వర్కర్లను తెప్పించి పని చేయించుకునే వెసులుబాటు.
రెండవది, తమకు కావాల్సినంతమందిని మాత్రమే నియమించుకునే అధికారం. ఇందులో మొదటిది ఎక్కడి నుంచైనా పనివారిని తెప్పించుకోవడానికి కార్మిక సంఘాలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. గతంలో కూడా చెన్నయ్ ఫైటర్ల విషయంలో అనేక సార్లు వివాదాలు జరిగాయి.
అయితే నిర్మాతల్లోని కొందరు ఇంకోలా అంటున్నారు. దేశంలోని ఎక్కడి వారిని ఎక్కడైనా పనిచేయించుకోవడం అన్నది నిబంధనలకు వ్యతిరేకం కాదని అంటున్నారు. మేకప్ వుమెన్ ల విషయంలో కోర్టు తీర్పులు పరిశీలిస్తే, ఇలాంటి వ్యవహారానికి నిబంధనలు అనుకూలమే అని స్పష్టమవుతుందంటున్నారు. అదీగాక టెక్నాలజీ బాగా పెరిగిందని, ఇప్పుడు దేశంలో ఎక్కడి నుంచైనా సినిమా తీసుకోవడం సాధ్యమే అని, అంతా డిజిటల్ కాబట్టి, ట్రాన్స్ మిట్ చేసుకోవడం సాధ్యమే అని అంటున్నారు.
మారుతున్న సాంకేతిక వ్యవహారాలను పట్టించుకోకుండా నిర్మాతలు ఇంకా పాత పద్దతులనే పట్టుకుని వేలాడుతున్నారని, రెడీ మేడ్ సెట్ లు, ఇంటీరియర్ వారికి సెట్ పనులు అప్పచెప్పడం వంటివి పనిని సులువుచేస్తాయంటున్నారు. అలాగే లైటింగ్ లో కూడా చాలా మార్పుల వచ్చాయని, ఆధునిక లైటింగ్ వాడితే మాన్ పవర్ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. మొత్తానికి సమ్మె అన్నది నిర్మాతలు ఖర్చు తగ్గించుకోవడానికి మార్గాలు నేర్పుతున్నట్లుంది.