తిరిగిరాని లోకాలకు చేరుకున్న తమ మిత్రుడు, సహచరుడు ఫిలిప్ హ్యూస్‌కి ప్రపంచ క్రికెట్ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఫిలిప్ హ్యూస్‌కి ఘనంగా నివాళులర్పించారు. ఫిలిప్ హ్యూస్ స్వగ్రామమైన మ్యాక్స్ విల్లేలో అంత్యక్రియలు నిర్వహించారు.
నవంబర్ 27 దేశవాళీ మ్యాచ్‌లో ఆడుతూ ఫిలిప్ హ్యూస్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. ఫిలిప్ హ్యూస్ మృతి క్రికెట్ ప్రపంచానికే పెద్ద షాక్. ఆ ఘటన నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా పూర్తిగా తేరుకోలేదు. హ్యూస్ మృతి కారణంగానే ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్న టెస్ట్ సిరీస్‌ని రీ షెడ్యూల్ చేశారు.
ఇప్పటికీ ఆటగాళ్ళు మానసికంగా సిద్ధంగా లేరన్న వాదన క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి వ్యక్తమవుతోంది. ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహచరులు భావోద్వేగాల్ని అదుపుచేసుకోలేకపోయారు.. ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు.. కొందరైతే బోరున విలిపించారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఇదో అతిపెద్ద విషాదమని క్రికెటర్లు వాపోతున్నారు.
కాగా, ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియల్లో భారత క్రికెట్ తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి పాల్గొన్నారు.