కొత్త డైరక్టర్లను ప్రోత్సహించడంలో నాగార్జునది మొదట్నించీ పైచేయి. అలాగే ఎవరైనా మాంచి హిట్ కొడితే చిన్న డైరక్టరైనా రమ్మని అవకాశం ఇవ్వడం అలవాటు. స్వామిరారా సుధీర్ వర్మకు, గుండెజారి గల్లంతయ్యిందే కొండా విజయ్ కుమార్ కు అలాగే అవకాశాలు ఇచ్చారు.
ఇప్పడు కార్తికేయ చందకు కూడా కూడా అన్నపూర్ణ నుంచి కబురు అందిందట. అభినందనలు తెలియచేస్తూ, వచ్చి కలవమని కూడా. ఇదిలా వుంటే అశ్వనీదత్, భవ్య సిమెంట్స్ నుంచి కూడా చందకు ఆఫర్లు అందినట్లు బోగట్టా. మరోపక్క సునీల్, నాని వంటి మిడిల్ రేంజ్ హీరోలు చందుతో పనిచేయాలన్న ఆసక్తి కనబరుస్తూ అభినందనలు తెలిపారట.
చందు వ్యవహారం ఇలా వుంటే హీరో నిఖిల్ పై మిడిల్ రేంజ్ డైరక్టర్ల కన్నుపడిందట. ఒకప్పుడు హిట్ కొట్టినా, సరైన హీరో డేట్లు లేక, పెద్ద సంస్థల అడ్వాన్సులు చేతిలో వున్న దర్శకులు ఇప్పుడు నిఖిల్ వైపు చూస్తున్నారట. వాళ్లకు అడ్వాన్స్ లు ఇచ్చిన సంస్థలు కూడా నిఖిల్ అయితే తమకు అభ్యంతరం లేదని అనడంతో, అతగాడికి సరిపోయే కథల కోసం కిందా మీదా పడుతున్నారని వినికిడి.