పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఎంత దూరం అయిపోయారో, ఎంత డిటాచ్డ్ గా వున్నారో అనిపిస్తోంది. ఎందుకంటే నా పేరు సూర్య సమర్పకుడు నాగబాబు అని ఆయనకు తెలియనేతెలియదట. నా పేరు సూర్య థ్యాంక్స్ మీట్ లో పవన్ కళ్యాణ్ జస్ట్ మూడు నాలుగు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. అల్లు అర్జున్ తాతగారి పేరు నిలబెట్టాలన్నారు. లగడపాటి తనకు సన్నిహితుడు అన్నారు. అంతవరకు బాగానే వుంది.
కానీ నా పేరు సూర్యకు నిర్మాతల్లో నాగబాబు ఒకరు అని తెలియదనడం చిత్రంగా వుంది. 'నాకేం చెప్పడు. సినిమాలు తీస్తున్నా అని కానీ, మరోటి కానీ' అని నాగబాబును ఉద్దేశించి పవన్ అనడం విశేషం. తను టూర్ కు వెళ్లే లోగా నా పేరు సూర్య చూస్తానని చెప్పారు.
అది చాలు-అల్లు అర్జున్
చాలా మంది పిల్లలు నా పేరు సూర్య సినిమా చూసి మిలటరీ యూనిఫారమ్ లు కుట్టించుకుంటున్నారని, ఆ కాంప్లిమెంట్ తనకు చాలు అని, తనకు మంచి ప్రశంసలు దక్కాయని అల్లు అర్జున్ అన్నారు. ఇది థాంక్స్ మీట్ అని, థ్యాంక్స్ ముందుగా పవర్ స్టార్ కే చెప్పాలని, కళ్యాణ్ బాబాయ్ కు థ్యాంక్స్ అని అనడం విశేషం.
ఇక్కడా కాన రాని అను
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఈ సక్సెస్ మీట్ కు కూడా డుమ్మా కోట్టింది. నా పేరు సూర్య విడుదల టైమ్ నుంచి మొహం చాటేసిన అను ఇమ్మాన్యుయేల్ ఇప్పటి వరకు మరి రాలేదు. పవన్ కళ్యాణ్ వస్తున్న సక్సెస్ మీట్ కు అయినా వస్తుంది అనుకుంటే ఇప్పుడు కూడా రాలేదు.
టీవీ 9లో లైవ్
నా పేరు సూర్య థాంక్స్ మీట్ కు హైలైట్ ఏమిటంటే, ఇది టీవీ 9లో లైవ్ ఇవ్వడం. టీవీ 9మీద, దాని యజమానుల మీద అంత ఎత్తున లేచిన పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగా సినిమా మీట్ లైవ్ ను టీవీ 9లో ఇవ్వడం అంటే విశేషమే. మొత్తం మీద టీవీ 9 – పవన్ రగడ ముగిసిపోయినట్లే అనుకోవాలి.