మనం చిత్రాన్ని చూసిన వారంతా ఇదొక అపురూప చిత్రమని తెగ పొగిడేస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఈ చిత్రం గొప్పతనాన్ని బాగా గుర్తించారు. ఇలాంటి కథతో సినిమా తీయడం ఎంత కష్టమో తెలిసిన సినీ రంగ ప్రముఖులు విక్రమ్ కుమార్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అలాగే ఈ చిత్రాన్ని వివిధ భాషల్లోకి రీమేక్ చేయాలని చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ ఈ చిత్రం రీమేక్ హక్కులు అమ్మడానికి నాగార్జున ఇష్టపడడం లేదు. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా, అక్కినేని హీరోలంతా కలిసి నటించిన సినిమాగా ఇది తమకి చాలా ప్రత్యేకమైనది కావడంతో ఇక వేరెవరూ ఇది రీమేక్ చేయకపోతే బాగుంటుందని నాగార్జున ఫీలింగ్.
కానీ హిందీ, తమిళ, కన్నడ రంగాల నుంచి రీమేక్ హక్కుల కోసం ఒత్తిడి బాగా ఉందట. నాగార్జునకి బాగా కావాల్సిన వ్యక్తులే రీమేక్ రైట్స్ అడుగుతోంటే కాదని ఎలా చెప్పాలో తెలీక ఇబ్బంది పడుతున్నాడట. ఈ అపురూప విజయాన్ని ఆస్వాదిస్తోన్న నాగార్జున రీమేక్ రైట్స్ కోసం వస్తోన్న ప్రెజర్ రూపంలో కాస్త నొప్పి కూడా తప్పట్లేదన్నమాట.