నాని హోస్టింగ్ హిట్? ఫట్?

ఒకసారి ఒకరు అద్భుతంగా చేసిన కార్యక్రమాన్ని మరొకరు తమ చేతిలోకి తీసుకుని శభాష్ అనిపించుకోవడం అంత సులువుకాదు. అమితాబ్ చేసిన కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమం అలాగే చాలా మందిని ఫెయిల్ చేసింది.…

ఒకసారి ఒకరు అద్భుతంగా చేసిన కార్యక్రమాన్ని మరొకరు తమ చేతిలోకి తీసుకుని శభాష్ అనిపించుకోవడం అంత సులువుకాదు. అమితాబ్ చేసిన కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమం అలాగే చాలా మందిని ఫెయిల్ చేసింది. ఆఖరికి తెలుగులో హీరో నాగార్జున మాత్రం శభాష్ అనిపించుకున్నాడు. మళ్లీ అదే ట్రాక్ మీదకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి, ఫెయిల్ అనిపించుకున్నారు.

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ ను ఎన్టీఆర్ స్టార్ట్ చేసి, శహభాష్ అనిపించుకున్నాడు. ఆరంభంలో కాస్త తడబడినా, తరువాత తనదైన ఓ స్టయిల్ ను తయారుచేసుకుని, ఆ షోను బ్లాక్ బస్టర్ చేసాడు. ఆ తరువాత అదే షో సీజన్ 2 అనౌన్స్ అయినపుడే ఎవరు హోస్ట్ అన్నది టాపిక్ అయింది. 

ఎన్టీఆర్ లెవెల్లో ఆ షో రక్తి కట్టించగలిగిన వారు ఎవరు అన్న క్వశ్చను పదేపదే వినిపించిది. ఆఖరికి నాని ఫిక్స్ అయ్యారు. అయినా కూడా నాని మీద అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ నాని ఏదో ఒక మ్యాజిక్ చేయకబోడు అని అందరూ నమ్మారు. కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే, బిగ్ బాస్ సీజన్ టూ పరాజయం దిశగా పయనిస్తోందా? అన్నట్లు కనిపిస్తోంది. ఆరంభంలో నాని చేసినది అద్భుతంగా లేకపోయినా, మెల్లగా ఇంప్రూవ్ అవుతుందని అనుకున్నారంతా.

కానీ వారం గడిచింది కానీ నాని హోస్ట్ వ్యవహారం జోరందుకోలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ గొంతులో వుండే గాంభీర్యం, బేస్ సౌండింగ్, దానికి తోడు ఆ చలాకీతనం, హుషారు నానిలో అస్సలు కనిపించలేదు. మరోపక్క ఈసారి పార్టిసిపెంట్స్ కూడా అలాగే వున్నారు. జనాలకు పెద్దగా పరిచయం లేని వారు ఎక్కువ మంది వున్నారు. వారితో బిగ్ బాస్ టీమ్ ఏదో ఎత్తుగడ వేసి, షోను రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తోంది కానీ, నాని సాయం అంతగా అందుతున్నట్లు లేదు.

దాంతో ఈ శనివారం జరిగిన ఎపిసోడ్ చప్పగానే సాగింది. మరి ఈరోజు (ఆదివారం) ఎలా వుంటుందో చూడాలి. ఇవ్వాళ కూడా నాని షోను రక్తికట్టించలేకపోతే, వచ్చేవారం పై జనాలకు అంతగా ఆసక్తి వుండదు.