నట్టి కుమార్ సెన్సేషనల్ నిర్మాత. సినిమా నిర్మాణం, పంపిణీ సంగతి ఎలా వున్నా, బోల్డ్ గా మాట్లాడడంలో మహా దిట్ట. ముందు వెనుక చూడకుండా, మొహమాటం లేకుంటా మాటల తూటాలు పేల్చేస్తారు. ఇప్పుడు ఆయన చాంబర్ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఎవర్ని అడిగి, నిబంధనలు తుంగలో తొక్కి, ఐ లాంటి భారీ డబ్బింగ్ సినిమాకు, కీలకమైన సంక్రాంతి సమయంలో అనుమతి ఇచ్చారన్నది ఆయన పాయింట్.
మన చాంబర్ నిబంధనల ప్రకారం సరైనదే..సబబైనదే ఆయన పాయింట్. కానీ ఇక్కడ ఓ మరో పాయింట్ వుంది. టెంపర్ జనవరి 9కి వస్తుంది. గోపాల గోపాల 14కు వస్తుంది అని ముందుగానే తేలిపోయింది. దాంతో ముకుంద డిసెంబర్ ఆఖరి వారానికి, పటాస్ అదే నెలకు ఫిక్సయిపోయాయి. దీంతో మిగిలిన చిన్నా, పెద్దా సినిమాలన్నీ వాటి విడుదల షెడ్యూళ్లను తమకు అనుకూలంగా మార్చుకున్నాయి.
చిన్న చిన్న సినిమాలు అన్నీ సీజన్ కు దూరంగా వుండిపోయాయి. కానీ అనుకోని అవాంతరాలు వచ్చి టెంపర్ విడుదల ఆగిపోయింది. పటాస్ జనవరి చివరి వారానికి వెళ్లింది. ఇలాంటి సమయంలో ఐ సినిమాను ఆపేసారు అనుకుందాం. మరి మార్కెట్ లో సినిమాలు ఏవుంటాయి? ఇప్పటికే బాక్సాఫీసు డల్ గా వుంది. 24,25ల్లో విడుదలైన రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అలా అలా సాగుతున్నాయి. 2న విడుదలైన సినిమాలు కూడా అంతంత మాత్రం.
అంటే 25 నుంచి 14 వరకు గ్రౌండ్ లో పెద్దగా పోటీ లేదు. మరి చిన్న సినిమాలన్నీ ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? ఇప్పుడు నట్టికుమార్ చెబుతున్న చిన్న సినిమాలు ఏవీ ఫెస్టివల్ మూడ్ ను క్యాచ్ చేసేంత లెవెల్ సినిమాలు కావు. కాస్త హోప్ వున్న బీరువా, పటాస్, అవును 2 లాంటివి 2న లేదా మూడున విడుదలైతే బాగుండేది. కానీ అలా జరగలేదు. మరి ఇంకేం సినిమాలున్నాయి. గోపాల గోపాల తప్ప. అంటే ఇప్పుడు ఐ విడుదల కాకుంటే గ్రౌండ్ మొత్తం గోపాల గోపాలకు వదిలేసినట్లే. పండగ వారం రోజులు వెయ్యి, రెండు వేల స్క్రీన్ లలో గోపాల గోపాల వేసుకుంటే సదరు యూనిట్ కు లాభాల పంటే. కానీ అలా కన్నా మిగిలిన సినిమాలను 9కి రప్పించడం మంచిది కదా?