మ్యాన్ ఆఫ్ ది మూవీస్

గంథపు చెట్టు సరసన పెరిగిన ప్రతి మొక్క చందన పరిమళాలు వెదజల్లదు. దాని సత్తా దానికి వుండాలి. వారసత్వం అండగా వుంటుందేమో కానీ విజయాలను తెచ్చి ఒళ్లో పెట్టదు. ఆశించిన తీరం చేరిన వాడు,…

గంథపు చెట్టు సరసన పెరిగిన ప్రతి మొక్క చందన పరిమళాలు వెదజల్లదు. దాని సత్తా దానికి వుండాలి. వారసత్వం అండగా వుంటుందేమో కానీ విజయాలను తెచ్చి ఒళ్లో పెట్టదు. ఆశించిన తీరం చేరిన వాడు, అది చాలు అనుకుంటే, ఆ తీరంలోనే వుండిపోతాడు.. మరిన్ని తీరాలు చూడలేడు. ఒక వ్యక్తి సత్తాను, అతను మోసే బరువు బాధ్యతలు స్పష్టం చేస్తాయి. 

తను అందుకోవాల్సిన తీరాలే ఇంకా ఎన్నో వుంటే, అదే సమయంలో తాను మరింత మందికి మార్గం చూపించాల్సి వస్తే… ఇలాంటి ఫీట్‌ను విజయవంతంగా చేసిన వాడిని విజేత అనడం అంటే చాలా సాదా సీదాగా వుంటుంది. అనుక్షణం కత్తి అంచున ప్రయాణించి గెలిచిన వాడిని అలా ఒక్క మాటతో కొలిచేస్తే, కాస్త కొరతగానే వుంటుంది. అతగాడిని, అతగాడు అందుకున్న విజయాలను, మోసిన బాధ్యతలను, తరచి చూస్తే స్ఫూర్తి దాయకంగా వుంటుంది..

సినిమా..అనుక్షణం ప్రజల అభిమానం, ప్రత్యర్థుల అనుమానం, మీడియా మితిమీరిన ఉత్సాహం, అన్నీ ఒకే చోట కేంద్రీకృతమయ్యే రంగం. అలాంటి రంగంలో అసమాన విజయాలు సాధించడం అంత సులువేం కాదు. 2014లో అలాంటి విజయాలను స్వంతం చేసుకున్నారంటే… మ్యాన్ ఆఫ్ ది మూవీస్ అని కాక మరేమనాలి. అలా చూస్తే… 2014 మ్యాన్ ఆఫ్ ది మూవీస్…. అక్కినేని నాగార్జున.

నాగార్జున…. 55 మన్మధుడు.. కానీ అతని అనుభవం వయస్సు ముఫ్ఫై ఏళ్లే. 1986లో తొలి సినిమా విక్రమ్ చేసినపుడు అతని లక్ష్యం, ఓ హీరోగా మారడం. చిత్రంగా విక్రమ్ సినిమాకు మూలమైన బాలీవుడ్ సినిమా పేరు హీరో. తొలి సినిమా విడుదలైన ముఫై ఏళ్ల తరువాత ఏ నటుడు ప్రస్థానమైనా చూసుకుంటే మహా అయితే రెండు మూడు మజిలీలు తప్ప ఎక్కువ వుండవు. 

ఎందుకంటే హీరోగా చేయాలి.. చేస్తూ వుండాలి.. అదే తపన, అదే ఆలోచన, అందుకే వ్యూహరచన చేసే కాలంలో దృష్టి మరో వైపు పెట్టాలన్నా, అందుకు సమయం చిక్కదు.. మెదడు సహకరించదు. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేయాలన్నా, షూటింగ్‌లు, డిస్కషన్లు, ప్రయాణాలు, వీటి నడుమ వ్యక్తిగత జీవితం.. ఇందుకే సరిపోతుంది కాలం అంతా. అలాంటి నేపథ్యంలో నాగ్ బహుముఖంగా విస్తరించాడు.

అన్నపూర్ణ స్టూడియోస్…ఎన్ త్రీ రియాల్టీ ఎంటర్ ప్రైజెస్…ముంబయ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్.. మహీ రేసింగ్ టీమ్.. మాటీవీ.. వీటన్నింటిలో ప్రత్యక్ష భాగస్వామ్యం.కళ్యాణ్ జ్యూయలర్స్.. బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరు

ఇద్దరు వారసుల్ని విజయవంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యతలు..తన కెరీర్‌ను ఆగిపోకుండా నడిపించాల్సిన కర్తవ్యం.. వీటన్నింటి నడుమ వచ్చే ఒడి దుడుకులు.. సమస్యలు.. వాటిని అధిగమించిన తీరు..

అన్నింటికి మించి పెద్దదిక్కుగా వుంటే తల్లితండ్రులు ఇద్దరు మూడేళ్ల తేడాతో తరలి రాని తీరాలకు చేరిపోతే.. అన్న, అక్క, మేనలుళ్లు, తన కుటుంబం..ఇలా అందరికీ తానే పెద్ద దిక్కుగా, మార్గదర్శిగా మారాల్సి వచ్చినపుడు, ఆ భారం మోయాల్సి వచ్చినపుడు వ్యవహరించిన తీరు..

ఇవన్నీ కలిసి..వెరసి..అక్కినేని నాగార్జునను మ్యాన్ ఆఫ్ ది మూవీస్ అనేలా చేసాయి.

అవును నాగ్ ఇప్పుడు కచ్చితంగా బహుముఖంగా తన ప్రతిభాపాటవాలను చూపించేసారు. సినిమాలు చేయడం వేరు..సినిమాలను ఎంచుకుంటూ చేయడం వేరు. పరాజయాలు చవిచూడడం వేరు..పడి లేవడం వేరు.ఇవన్నీ నాగ్ తన కెరీర్ లో చూసేసారు. ఆ ఎత్తుపల్లాల వైనం ఆయనకు ఎరుకే. అయినా వెరుపు మాత్రం లేదు.

2006లో శ్రీరామ దాసు తరువాత బాస్, డాన్, కృష్ణార్జున, కింగ్, కేడీ, రగడ, గగనం, రాజన్న, షిర్డి సాయి, ఢమరుకం, గ్రీకువీరుడు, భాయ్ సినిమాలు చేసారు. చిన్న చిన్న అతిథి పాత్రలు చేసిన సినిమాలు ఒకటి రెండు వున్నాయి,. అది వేరే సంగతి. 2006లో శ్రీరామ దాసు సినిమా తరువాత చేసిన డజను సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఒక హీరోకి ఇంతకన్నా ఇబ్బందికరమైన పరిస్థితి మరొకటి వుండదు. అయినా ఇదే సమయంలోనే నాగ్ బహుముఖంగా విస్తరించారు. గగనం, రాజన్న, షిర్డిసాయి, ఢమరుకం, భాయ్ సినిమాలు అన్నీ ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని జోనర్‌లు. అలా ప్రయత్నించుకుంటూనే ముందుకు వెళ్లారు నాగ్. అపజయాలకు వెరవకుండా.

 ఆఖరికి మనం సినిమాతో హిట్ కొట్టేసారు. కుదురైన అక్షరం రూపు దిద్దుకున్నాక, పలక మీద అంతకు ముందు దిద్దిన అక్షరాలన్నీ మరి కనిపించవు. మనం అలాంటి విజయాన్ని అందించింది నాగ్ కు. 2006 నుంచి 2014 ఎనిమిదేళ్లలోనే ఆయన మ్యాన్ ఆఫ్ ది మూవీస్ అనిపించుకున్నది. 2009 లో తన కొడుకు నాగ చైతన్యను సినిమాల్లోకి తీసుకువచ్చారు..2014లో రెండో కొడుకు అఖిల్ కు ఫ్లాట్ ఫారమ్ తయారు చేసారు. తన కెరియర్, కొడుకుల భవిష్యత్ అదే సమయంలో ఆయన వ్యాపార వేత్తగా రాణించారు. ఎన్ అనేపేరుతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసారు. 

ఎన్టీఆర్, కృష్ణ ఏర్పాటు చేసిన స్టూడియోలు నామ్ కే వాస్తేగా మిగిలిన సమయంలో తన తండ్రి ఏర్పాటు చేసిన స్టూడియోను తన చేతుల్లోకి తీసుకుని, విజయవంతంగా ముందుకు నడిపించారు. స్టూడియో బ్యానర్ పై వరుసగా చిత్రాలు చేసారు..చేస్తున్నారు. అదే సమయంలో పంపిణీ దారుగా మారారు. చిత్రంగా వీటి వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధం లేని, బ్యాడ్ మింటన్ జట్టు లో సునీల్ గవాస్కర్ తో కలిసి భాగస్వామిగా మారారు.  ధోనితో కలిసి రేసింగ్ టీమ్ ఏర్పాటు చేసారు. కళ్యాణ్ జ్యూయలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వున్నారు. అదే సమయంలో ఆయన టెలివిజన్ రంగంలోకి సెక్సస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. 

చానెల్ అధినేతగా, సీరియళ్ల నిర్మాతగా ఆపై ఏకంగా చిన్నతెరపై ప్రయోక్తగా అడుగుపెట్టారు. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్ లోనే అత్యంతగా అభిమానించే తల్లి అక్కినేని అన్నపూర్ణను (2011)ను తండ్రి ఎఎన్నార్ ను (2014)ను కోల్పోయారు. తండ్రి మరణించిన తరువాత ఆ పెద్ద కుటుంబం మొత్తం నాగ్ ఫోల్డ్ లోకి వచ్చి, ఆయన కనుసన్ననలో నడిచిన తీరు చూస్తే, తెలుస్తుంది..అతను కుటుంబ పెద్ద అనే పాత్రలోకి ఎలా పరకాయ ప్రవేశం చేసేసారో,. సినిమాలు ఫ్లాపయినా, ఆప్తులు దూరమైనా, అనుకోని సంఘటనలు ఇబ్బంది పెట్టినా, దేనికీ చలించకుండా సాగిపోతున్న వైనం చూస్తే తెలుస్తుంది.. అతను ఎంతటి ధీరోదాత్తుడో. వ్యాపార భాగ్వస్వామి జైలులో పడ్డారు. జైలులో వున్న నేతతో సంబంధాలు అంటగట్టారు. ప్రభుత్వం స్థలం ఆక్రమించుకుని కన్వెన్షన్ కట్టారన్నారు. దేనికీ వెరవలేదు..జంకలేదు..లొంగలేదు..

అన్ని వ్యవహారాలు సమన్వయం చేసుకుంటూనే 2014లో అనేక విజయాలు సాధించారు. మనం ..సినిమాగా మంచి సినిమా..మంచి హిట్. దాని ప్రివ్యూ నిర్వహించిన తీరు అనితర సాధ్యం. అమితాబ్ గిరి గీసి అందుకోమని విసిరిన సవాల్‌ను ఎవరూ అందుకోలేకపోయిన తరుణంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ తన స్టయిల్ కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమం చూపించారు. ఈ కార్యక్రమం ఇలా కూడా చేయచ్చా అంటూ..ఓ రియాల్టీ షోను కాస్త హార్ట్ టచింగ్ ప్రోగ్రామ్ గా మార్చేసారు. అదే సమయంలో గుజరాత్ వెళ్లి మోడీ పాలనను ప్రత్యక్షంగా చూసి వచ్చి, రాజకీయాలకు తానేం దూరం కాదనిపించుకున్నారు.

మరోపక్క హీరోగా ఇంకా సరిగ్గా నిలదొక్కుకోని కొడుకు నాగ్ చైతన్యకు నిర్మాతగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించేసారు. ఇంకో కొడుకు అఖిల్ తొలి సినిమాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. తండ్రి ప్రారంభించిన అవార్డు ను కొనసాగస్తూ, ఆల్ ఇండియాస్టార్ అమితాబ్ ను సన్మానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ముఖ్యఅతిధిగా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును అతిధిగా రప్పించగలిగారు,. బహుశా కేసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న అతి పెద్ద సినిమా ఫంక్షన్ ఇప్పటికి ఇదేనేమో. అంతకు ముందు మేము సైతం అంటూ  టాలీవుడ్ చేసిన హంగామాకు కేసిఆర్ ను సినిమా పెద్దలు మాటమాత్రమైనా పిలవని నేపథ్యం వుంది.

ఇన్ని పనులు ఏకకాలంలో చక్కబెట్టిన నాగ్… నాగార్జున.. అక్కినేనిని ‘గ్రేట్ ఆంధ్ర’ మ్యాన్ ఆఫ్ ది మూవీస్ అని సగర్వంగా ప్రకటిస్తోంది.

విఎస్‌ఎన్ మూర్తి