500 కోట్ల రూపాయలతో రామాయణం వస్తోంది… 125 కోట్ల రూపాయలతో సంఘమిత్ర వస్తోంది.. 400 కోట్ల రూపాయలతో 2.0 తెరకెక్కుతోంది.. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలతో మహాభారతం ప్రాజెక్టు ఎనౌన్స్ అయింది. ఏ నిర్మాత అయినా లాభాల కోసమే సినిమా చేస్తాడు.. వీళ్లు కూడా లాభాల కోసమే ఈ సినిమాలు ఎనౌన్స్ చేశారు. అయితే ఇంత ఖర్చుపెట్టి ఎంత లాభం ఆర్జిస్తారనేది ప్రశ్న.
బాహుబలి-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది. ఇప్పటికే కలెక్షన్లు 1200 కోట్లు దాటేశాయి. ఈ ప్రాజెక్టు ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ సినిమాలన్నీ (2.0 తప్ప) క్యూ కట్టాయనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే భారీగా ఖర్చుపెట్టినంత మాత్రాన అంతే భారీగా లాభాలు రావు. దీనికి ఎంతో ప్లానింగ్, ఇంకెంతో మార్కెటింగ్ చాతుర్యం కావాలి.
బాహుబలి-2 సినిమా ఊరికే హిట్ అయిపోలేదు. అన్ని తెలుగు సినిమాల్లానే దాన్ని కూడా రిలీజ్ చేస్తే.. వంద కోట్ల దగ్గరే ఆగిపోయి ఉండేది. మహా అయితే మరో 50కోట్లు వచ్చేవి. కానీ ఆ ఫ్రాంచైజీకి జక్కన్న అండ్ కో అనుసరించిన మార్కెటింగ్ స్ట్రాటజీ అద్భుతం. తన సినిమా ప్రచారానికి కావాల్సిన ఏ చిన్న అంశాన్ని ఆయన వదల్లేదు. మూవీకి డబ్బులొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోలేదు. బాలీవుడ్ లో గ్రాండ్ రిలీజ్ కోసం కరణ్ జోహార్ తో చేతులు కలపడం కూడా ఓ కీలకమైన ఎత్తుగడ అని చెప్పాలి.
మార్కెటింగ్ స్ట్రాటజీని పక్కనబెడితే, సినిమాను నలుగురి నోళ్లలో నానేలా చేయడం కూడా ఒక ఆర్ట్. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఒకే ఒక్క క్వశ్చన్ తో ప్రేక్షకుల్ని రెండేళ్ల పాటు వెయిట్ చేయించగలిగారు రాజమౌళి. మరి అలాంటి మెరుపులాంటి ఆలోచనతో మరో దర్శకుడు రాగలడా. బాహుబలి రేంజ్ లో హైప్ క్రియేట్ చేసే సబ్జెక్ట్ తేగలడా..
మార్కెటింగ్ స్ట్రాటజీ, కథ కుదరడంతో పాటు.. ఇలాంటి భారీ ప్రాజెక్టు కోసం ఏళ్ల తరబడి టైం కేటాయించే డెడికేటెడ్ టీం కూడా కావాలి. అప్పుడు మాత్రమే పెట్టిన ఖర్చుకు సార్థకత, నిర్మాతకు లాభాలు రెండూ చేకూరుతాయి. ఈ యాంగిల్స్ లో ఆలోచించిన తర్వాతే వందల కోట్ల బడ్జెట్ పెడితే మంచిది.
అయితే ఒకటి మాత్రం వాస్తవం. బాహుబలి-2 సినిమా తెలుగు సినిమా మార్కెట్ కు మరిన్ని దారులు చూపించింది. పబ్లిసిటీకి ఇంకొన్ని కొత్త యాంగిల్స్ చూపించింది. పనిలోపనిగా భారీ వసూళ్లకు మరికొన్ని షార్ట్ కట్స్ కూడా చూపించింది. భవిత్యత్తులో మరో బడా సినిమాకు ఇవన్నీ పనికొస్తాయి.