నేనేమీ గొప్ప నటుడిని కాదు, నా బలం, బలహీనత ఏమిటో నాకు పక్కాగా తెలుసు. అందుకే నాకు సరిపోయే కథలు ఎన్నుకుని, వాటిలో నాకు వచ్చిన మేరకే నటించడానికి ప్రయత్నిస్తున్నా, అన్నారు హీరో విజయ్ ఆంటోనీ. ఓ టిపికల్ ఫేస్ లుక్స్ తో సలీం, బిచ్చగాడు, భేతాళుడు సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఈ సారి ఇంద్రసేన అంటూ మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను నటుడిగా కన్నా టెక్నీషియన్ గా ఫీలవుతానని, అందుకే తనకు నచ్చేవి కాకుండా, ప్రేక్షకులు దేన్ని కోరుకుంటున్నారో, వాటిల్లో తనకు ఏది సరిపోతుందో వాటిని అందించడానికి చూస్తున్నా అన్నారు. ప్రతి విషయాన్ని దగ్గర వుండి చూసుకోవడం తనకు అలవాటు అని, అందుకే డబ్బింగ్ సినిమా, తెలుగు వెర్షన్ అని వదిలేయకుండా, ఇక్కడ కూడా వీలయినంత సమయం వెచ్చించి, మంచి ప్రచారం కోసం కృషి చేస్తున్నా అన్నారు.
నిర్మాతగా, నటుడిగా, కథలు వినడం, ఇతరత్రా పనులతో బిజీ కావడం అన్నది మ్యూజిషియన్ గా తన కెరీర్ కు కాస్త బ్రేక్ వేసిన మాట వాస్తవమే అని విజయ్ ఆంటోనీ అన్నారు. ఇంద్రసేన సినిమాలో తాను ద్విపాత్రాభినయం చేసానని, ఇంద్రసేన కాకుండా రుద్రసేన అనే పాత్ర కూడా వుంటుదని వివరించారు. టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ద్విపాత్రాభినయం పెద్దగా కష్టం అనిపించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
జీఎస్టీ పదంతో పాట పెట్టడం గురించి ప్రస్తావిస్తూ, సరదాగా చేసిన ప్రయోగం తప్ప, ఏ విమర్శా చేయలేదని వివరించారు. కొన్ని పదాలకు సెన్సార్ అభ్యంతరం చెబితే మ్యూట్ చేస్తామనారు. సినిమాను కేవలం ప్రేక్షకులను అలరించడానికే తీయాలన్నది తన అభిమతమని, ఆ విధంగానే తన సినిమాలు వుంటాయన్నారు. ఇప్పటి దాకా తనకు డ్యాన్స్ చేయడం రాదని, త్వరలో నేర్చుకుందాం అనుకుంటున్నానని విజయ్ ఆంటోనీ చెప్పారు.