రిపీట్.. ఆగస్టు 11 ?

ఆగస్టు 11.. డిసెంబర్ 22 ఈ రెండు డేట్లు 2017లో టాలీవుడ్ రికార్డుల్లో నిలుస్తాయేమో? ఎందుకంటే పంతాలకు, పట్టింపులకు పోయి ఆగస్టు11న నితిన్ నటించిన 'లై', బోయపాటి అందించిన జయ జానకీ నాయక, రానా-తేజ…

ఆగస్టు 11.. డిసెంబర్ 22 ఈ రెండు డేట్లు 2017లో టాలీవుడ్ రికార్డుల్లో నిలుస్తాయేమో? ఎందుకంటే పంతాలకు, పట్టింపులకు పోయి ఆగస్టు11న నితిన్ నటించిన 'లై', బోయపాటి అందించిన జయ జానకీ నాయక, రానా-తేజ కాంబినేషన్ లోని నేనే రాజు నేనే మంత్రి విడుదలచేసారు. ఎవ్వరికీ సంతృప్తికరమైన ఫలితం దక్కలేదు. 

మళ్లీ అలాంటి తప్పిదమే చేస్తున్నారు డిసెంబర్ 22న. దిల్ రాజు-నాని కాంబినేషన్ లో ఎంసిఎ, విక్రమ్ కుమార్- అఖిల్ కాంబినేషన్ లో తయారవుతున్న హలో, అల్లు శిరీష్ తో విఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఒక్క క్షణం విడుదలవుతున్నాయి. ఈ మూడింటిలో ఈసారి హలోకి సమస్య. ఎందుకంటే జయజానకీ నాయక మాదిరిగా ఇది కూడా నలభై కోట్ల బడ్జెట్ లో తయారైన సినిమా.

మిగిలిన రెండు సినిమాల బడ్జెట్ మాత్రం పది నుంచి పన్నెండు కోట్లలోనే. పైగా ఆ రెండూ సేఫ్ జోన్ లో వున్నాయి. శాటిలైట్లు అమ్మేసుకోవడం, ఏరియాలు రీజన్ బుల్ రేట్లకు అమ్మడం ద్వారా అవి ఫరావాలేదు అనే స్టేజ్ లో వున్నాయి. ఒక వేళ తేడా వచ్చినా మహా అయితే నాలుగయిదు కోట్లకు మించి తేడా రాదు. 

కానీ హలో అలా కాదు. చాలా వరకు డైరక్ట్ రిలీజ్. డబ్బులు సమస్య కాదు, డైరక్ట్ రిలీజ్ అనుకుంటే, అఖిల్ కెరీర్ కు కీలకం ఈ సినిమా. నాని హిట్ ల లైన్ లో వున్నాడు. ఓ సినిమా సమస్య కాదు. అల్లు శిరీష్ కు కూడా పెద్ద సమస్య కాదు. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో వున్నాడు. అప్పుడే భారీ స్టార్ డమ్ ను ఏమీ ఆశించడం లేదు. సమస్య అల్లా అఖిల్ కే.  కచ్చితంగా సినిమా హిట్ అనిపించుకోవాలి. బాక్సాఫీస్ దగ్గర పాస్ కావాలి. లేదూ అంటే మళ్లీ అన్నపూర్ణ బ్యానర్ పైనే సినిమా చేయాల్సి వుంటుంది. 

వాస్తవానికి హలో కన్నా ముందే తాము డేట్ చెప్పామని దిల్ రాజు యూనిట్ వర్గాలు అంటున్నాయి. మరి అది తెలిసీ నాగ్ ఎందుకు ఈ డేట్ ను ఎంచుకున్నట్లో? ఇక్కడ మరో సమస్య కూడా వుంది. ఆ తరువాతి వారం మరో మూడు సినిమాలు వస్తున్నాయి. ఆ తరువాతి వారం ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తోంది. ఈ పరిస్థితులు కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వుంటుంది. మరేమవుతుందో, ఈ మూడు సినిమాల్లో ఏవి విజేతలు అవుతాయో చూడాలి.