ఆఖరికి ఇప్పటికి ఆక్సిజన్ సినిమాకు కాస్త ఊపిరి అందింది. అనేకానేక సమస్యలతో ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఒక స్టేజ్ లో హీరో గోపీచంద్ ఈ సినిమా మీద ఆశలు కూడా వదిలేసుకున్నారు. కానీ నిర్మాత ఎఎమ్ రత్నం మాత్రం పట్టు వదలకుండా, కిందా మీదా పడి, ఎక్కడో అక్కడి నుంచి డబ్బులు అడ్జస్ట్ చేసుకుని సినిమాను ఫినిష్ చేసారు.
అప్పటికీ కష్టాలు గట్టెక్కలేదు. గోపీచంద్ గౌతమ్ నందా సినిమా సరిగ్గా ఆడకపోవడం అన్నది కూడా ఓ సమస్య అయింది. అయితే నిర్మాత ఎఎమ్ రత్నం ధైర్యం చేసి తన సినిమాను చూస్తామన్న బయ్యర్లు అందరికీ చూపించేసారు. చూసి చెప్పండి అంటూ ఆఫర్లు ఇచ్చారు. అప్పుడు కాస్త పరిస్థితి మెరుగయింది. ఆసియన్ సునీల్ సినిమాకు సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
ఆంధ్ర, సీడెడ్ లో సినిమాను అమ్మగలిగారు. ఇలా అలా మొత్తం మీద 12కోట్ల వరకు బిజినెస్ చేయగలిగారు. అంతకు ముందు అయిదారు కోట్లకు శాటిలైట్ డిజిటల్, రీమేక్ రైట్స్ అమ్మేసారు. ఇలా అలా పెట్టుబడి దగ్గర దగ్గరగా రికవరీ అనిపించుకోగలిగారు.
దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. ఇక మిగిలింది సినిమా జనాలకు నచ్చడం మాత్రమే. అది సినిమా చేతుల్లో తప్ప ఎవరి చేతుల్లో లేదు. హిట్ అనిపించుకుంటే కొడుకు జ్యోతి కృష్ణ కన్నా, తండ్రి ఎఎమ్ రత్నంకు ఆక్సిజన్ అందుతుంది. మరో సినిమా తెలుగులో అటెంప్ట్ చేయడానికి వీలు కలుగుతుంది. ఎన్నో మంచి సినిమాలు, భారీ సినిమాలు అందించిన నిర్మాత ఎఎమ్ రత్నం ఓ మీడియం రేంజ్ సినిమాకు ఇన్ని సినిమా కష్టాలు పడడం అంటే, సినీమాయ అనుకోవాలి తప్ప మరేమిటి?