నాని కారు ప్రమాదంపై కొత్త వదంతులు

హీరో కృష్ణ నటించిన నేరము శిక్ష సినిమా గుర్తుందా? హీరో కారును ప్రమాదానికి గురి చేస్తే, డ్రయివర్ ఆ నేరం తనమీద వేసుకుంటాడు. అచ్చంగా అలాగే జరిగిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ…

హీరో కృష్ణ నటించిన నేరము శిక్ష సినిమా గుర్తుందా? హీరో కారును ప్రమాదానికి గురి చేస్తే, డ్రయివర్ ఆ నేరం తనమీద వేసుకుంటాడు. అచ్చంగా అలాగే జరిగిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం హీరో నాని ప్రయాణిస్తున్న కారు తెల్లవారు ఝామున జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రమాదానికి గురయింది. రోడ్డు పై వున్న కరెంట్ పోల్ కు ఢీ కొట్టింది. పోల్ పడిపోయింది. ప్రమాదం జరిగి దాదాపు పది గంటలయినా బయటకు వార్త రాలేదు.

తొలిసారి గ్రేట్ ఆంధ్రకు ఈ వార్త విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. అటు ప్రింట్ మీడియాకు కానీ, విజువల్ మీడియాకు కానీ తెలియలేదు. నాని ఏదో ఆసుపత్రిలో వున్నారని తెలిసింది కానీ, ఆ ఆసుపత్రి పేరు కూడా తెలియలేదు. కానీ వివరాలు అందించింది అత్యంత విశ్వసనీయ వర్గాలు కావడంతో వెంటనే ప్రమాదం వార్తను గ్రేట్ ఆంధ్ర ప్రచురించింది.

ఆ తరువాత వివరాలు బయటకు వచ్చాయి. నాని షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని, డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే నాని ఇంటికి ఫోన్ చేసి, వేరే కారు తెప్పించుకుని వెళ్లిపోయారని, పోలీసులు వచ్చేసరికి డ్రయివర్ మాత్రమే వున్నారని ఆ వార్తలు సారాంశం. ఆరంభంలో కారులో వున్నది నాని తండ్రి అని, తరువాత కాదు, నానియే అని కూడా ఆ వార్తల్లో వివరాలు వున్నాయి.

ఇదిలా వుంటే ఇప్పుడు మరో కొత్త వదంతి టాలీవుడ్ లో వినిపిస్తోంది. అసలు ఆ రోజు కారు నడిపింది నానియే అన్నది ఈ వదంతుల సారాశం. ప్రమాదం జరగగానే నాని, ఫోన్ చేసి డ్రయివర్ ను రప్పించి, విషయం వివరించి, కారు అప్పగించి వెళ్లిపోయారని, అందుకే డ్రయివర్ పోలీసుల దగ్గర తడబడి ముందు నాని తండ్రి అని, తరువాత కాదు, నాని అని చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంత ప్రమాదం జరిగితే నాని అలా కారును, డ్రయివర్ ను తెల్లవారుఝామన ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారా? పైగా ఈ విషయం అస్సలు మధ్యాహ్నం వరకు బయటకు రాకుండా వుంచుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎప్పడయితే వార్త బయటకు వచ్చిందో, అప్పుడు నాని ట్వీట్ ద్వారా విషయం వెల్లడించారు. అప్పటి దాకా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే నాని యూనిట్ కు చెందిన వారితో సంబందాలు వున్న వారికి వార్త తెలియడంతో, అది గ్రేట్ ఆంధ్రకు చేరి బయటకు వచ్చింది.