పహ్లాజ్ నిహ్లానీ.. గత రెండేళ్లలో సినిమా వార్తల్లో బాగా వినిపించిన పేరు. సీబీఎఫ్సీకి చాలా మంది చైర్మన్లు వచ్చిపోయారు కానీ, నిహ్లానీలా వివాదాలు రేకెత్తించిన వాళ్లు మరొకరు లేరు. సినిమాల్లో రొమాంటిక్ సీన్లు, ముద్దు సీన్ల విషయంలో వీలైనంతగా వివాదాలు రేపారు నిహ్లానీ. జేమ్స్ బాండ్ సినిమా ఇండియన్ లాంగ్వేజెస్ డబ్బింగ్ వెర్షన్లో, ఇండియాలో విడుదల అయిన ఇంగ్లిష్ వెర్షన్లో ముద్దు సీన్లను కట్ చేయాల్సిందే.. అని పట్టుబట్టడంతో నిహ్లానీ పేరు మార్మోగింది.
సంస్కారీ జేమ్స్ బాండ్ ను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడని.. విమర్శలు, సెటైర్లు వచ్చాయి నిహ్లానీ మీద. ఆ తర్వాత చాలా సినిమాల విషయంలో పహ్లాజ్ నిహ్లానీ నిప్పులు రాజేశాడు. ఆఖరికి ‘ఇంటర్ కోర్స్ ’ అనే మాట కూడా ఇతడికి బూతులా ధ్వనించింది. అలాంటి పదాలు సినిమాల్లో ఉండటానికి వీల్లేదని తేల్చేశాడు. ఇక పంజాబ్ లో డ్రగ్స్ ఉచ్చుపై రూపొందిన ‘ఉడ్తాపంజాబ్’ సినిమా విషయంలో నిహ్లానీ తీరు తీవ్ర విమర్శల పాలైంది.
పంజాబ్ లో పరిస్థితులకు అద్దం పట్టిన ఆ సినిమాను ముప్పుతిప్పలు పెట్టాడు. మరి ఇదంతా పాలకపక్షాలకు అనుకూలంగా ఉంటూ, వారి విధేయుడిని అని చాటుకోవడానికి నిహ్లానీ చేసిన పని.. అనే మాట ఆది నుంచి వినిపిస్తూ ఉంది. అలాగే స్వతహాగా నిర్మాత కూడా అయిన ఈయన.. గతంలో తీసిన సినిమాల్లోని బూతును అనేక మంది ప్రస్తావించారు. ఆయన తీరును ఎండగట్టారు. మరి అలా రెండేళ్లు గడిచాయి. నిహ్లానీని సీబీఎఫ్సీ చైర్మన్ గా కొనసాగించలేదు కేంద్రం.
దీంతో ఆయన ఆ పదవి నుంచి వైదొలిగాడు.. ఇప్పుడు మళ్లీ నిర్మాణ పనుల్లో బిజీ అయ్యాడు. మరి ఇప్పుడు ఆయన సమర్పణలో విడుదల కాబోతున్న సినిమా ఏదో తెలుసా? ‘జూలీ-2’. ఈ హాట్ హాట్ సినిమా సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీనే. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఈయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడట. మరి సీబీఎఫ్సీ బాస్ గా ఉన్నంతసేపూ.. కటింగ్స్ చెబుతూ… బూతుకు స్థానం లేదని చెప్పిన నిహ్లానీ ఆ పదవి నుంచి దిగాకా.. బూతు సినిమాగా, హాట్ సినిమా పేరు పొందిన పిక్చర్ ను సమర్పించేసుకుంటున్నాడు. అదీ కథ.