‘ముద్ర’ అంటూ ఒక సినిమా థియేటర్ల వద్దకు వచ్చేసింది. ఒక మోస్తరు పట్టణాల్లో కూడా ఈ సినిమా విడుదల అయిపోయింది. జగపతిబాబు ఇందులో ప్రధానపాత్ర ధారి. అందుకు సంబంధించిన పోస్టర్లు రోడ్లపై కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సినిమాకు ఆన్ లైన్ బుకింగ్స్ కూడా పెట్టారు. వాస్తవానికి ఇది ఎప్పుడో మొదలైన సినిమాలాగా ఉంది. ఇలాంటి పిక్చర్లను రిలీజ్ చేసే అలవాటున్న నట్టికుమార్ దీన్ని విడుదల చేసినట్టుగా ఉన్నాడు.
అయితే ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ సినిమా ‘ముద్ర’ మేకింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టీఎన్ సంతోష్ అనే దర్శకుడు ఆ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తియినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో నిఖిల్ సినిమా పేరుతోనే.. ముద్ర అంటూ మరో సినిమా థియేటర్ల వద్దకూ వచ్చేయడం విశేషం.
ఇదంతా కుట్ర అని.. తన సినిమా టైటిల్ ను తస్కరించారని నిఖిల్ అంటున్నాడు. అయితే నట్టికుమార్ మీడియా ముందుకు వచ్చి నిఖిల్ మీద ఫైర్ అయ్యాడు. తమ సినిమాను చూడొద్దని అనడానికి నిఖిల్ ఎవరంటూ నట్టికుమార్ అంటున్నాడు. అందుకు సంబంధించిన రచ్చ జరుగుతూ ఉంది. అయినా.. ఇలా ఒకే టైటిల్ విషయంలో వివాదాలు రావడం కొత్త ఏమీకాదు. అలాంటి సందర్భాల్లో స్వల్ప మార్పులు చేసుకొంటూ ఉంటారు.
ఇదివరకూ ‘కల్యాణ్ రామ్ –కత్తి’, ‘ఆటోగ్రాఫ్- మై స్వీట్ మెమొరీస్’ వంటి సినిమాల వివాదాలు ఈ తరహావే. కల్యాణ్ రామ్ కత్తి అనే టైటిల్ తో వచ్చినప్పుడు వివాదం రేగింది. దీంతో కల్యాణ్ రామ్ –కత్తి అని టైటిల్ మార్చారు. ఇక రవితేజ ‘ఆటోగ్రాఫ్’ సినిమా వచ్చినప్పుడూ అదే కథ. దీంతో దానికి ‘ఆటోగ్రాఫ్- మై స్వీట్ మెమోరీస్” అంటూ యాడ్ చేశారు. ఖలేజా సినిమా పేరును కూడా ‘మహేశ్- ఖలేజా”గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ‘ముద్ర” అని సినిమా వచ్చిన నేపథ్యంలో నిఖిల్ సినిమా ‘నిఖిల్-ముద్ర” అవుతుందేమో!
బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?
అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత