నిర్మాత అంటే అలా వుండాలి

సినిమా అన్నది ఒక్కరి కష్టంకాదు. లైట్ బాయ్ దగ్గర నుంచి డైరక్టర్ వరకు అందరి కష్టం వుంటుంది. అయితే రిస్క్ మాత్రం ఒక్కరిదే వుంటుంది. అది నిర్మాతదే. అందువల్ల హిట్ అయిన తరువాత పేరు…

సినిమా అన్నది ఒక్కరి కష్టంకాదు. లైట్ బాయ్ దగ్గర నుంచి డైరక్టర్ వరకు అందరి కష్టం వుంటుంది. అయితే రిస్క్ మాత్రం ఒక్కరిదే వుంటుంది. అది నిర్మాతదే. అందువల్ల హిట్ అయిన తరువాత పేరు మిగిలిన వారిదైతే, లాభం నిర్మాతది అవుతుంది. కానీ ఛలో నిర్మాత ఉష మాల్పూరి అలా అనుకోవడం లేదు. తన కుమారుడు నాగశౌర్యతో తీసిన సినిమా పెద్ద హిట్ అయింది. సినిమాకు పెట్టిన పెట్టుబడిపోనూ, బయ్యర్లకు భయంకరమైన లాభాలు వచ్చాయి కానీ నిర్మాతకు ఓ మాదిరిగానే మిగిలాయి.

అయినా కూడా సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న బహుబతి అయినా ఇవ్వాలని నిర్మాత ఉషా మాల్పూరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాకు దర్శకత్వం వహించిన వెంకీ  కుడుమలకు, మాంచి సంగీతం అందించిన స్వరసాగర్ కు సర్ప్రయిజ్ బహుమతులు ప్లాన్ చేసారని వినికిడి. గురువారం సాయంత్రం ఓ మాంచి పార్టీ ఏర్పాటుచేసి, లైట్ బాయ్ దగ్గర నుంచి డైరక్టర్ వరకు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి, అభినందించి, ఏదో ఒక బహుమతి ఇచ్చే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

డైరక్టర్ మారుతికి కూడా ఇలాంటి అభిరుచి వుంది. తన నిర్మాణంలోని సినిమా హిట్ అయితే తన యూనిట్ అందరికీ ఏదో చిన్న బహుమతి అన్నా ఇచ్చి అభినందించడం. ఐరా క్రియేషన్స్ కూడా ఇదే బాటలో వున్నట్లు తెలుస్తోంది.  

ఛలో సినిమా విడుదలై ఇప్పటికి 12 రోజులు దాటింది. ఇప్పటికీ 70 టు 80 పర్సంట్ ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఈ సినిమా నైజాం, ఈస్ట్ గోదావరి హక్కులు నిర్మాతే ఉంచుకున్నారు. అలాగే మిగిలిన చాలా ఏరియాల్లో వచ్చే లాభాల్లో వాటా వుంది. అందువల్ల నిర్మాత ఫుల్ హ్యాపీగా వున్నారు. ఒకపక్క నిర్మాతగా లాభాలు. మరోపక్క తల్లిగా కొడుక్కు విజయం అందించిన ఆనందం.