ఆయనో పెద్ద మనిషి. ఏం చేస్తారు అని అడగకండి. ఏమీ చేయరు. మాటలు చెబుతుంటారు. ధార్మిక కార్యక్రమాల దిశగా నడిపిస్తుంటారు. ఆ విధంగా కోట్లకు కోట్లు ఖర్చు చేయిస్తుంటారు. ఆయన మాటలకు పడిపోయారా? ఇక అంతే.
టాలీవుడ్ లో ఓ నిర్మాత గత కొన్నేళ్లుగా ఈ పెద్దాయిన ను పూర్తిగా నమ్మేసారు. మామూలుగా నమ్మలేదు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడకు తీసుకెళ్లారు. తనకు పరిచయమైన పెద్ద పెద్ద వాళ్లకు ఈయనను పరిచయం చేసారు. మహానుభావుడు..మార్తాండతేజుడు అని మరీ చెప్పుకొచ్చారు. ఏమైతేనేం ఆ నిర్మాత ఈ పెద్దాయిన చేతుల మీదుగా కోట్లు అయితే ఖర్చు చేసేసారు. ప్రస్తుతం సినిమాలు తీయడం లేదు కనుక ఇక ఖర్చు చేయడానికి కోట్లు లేవు
దాంతో గత కొంతకాలంగా సైలంట్ గా వున్నా ఆ ‘పెద్ద మనిషి’ నిర్మాతను మార్చేసారు. నిన్నటికి నిన్న టాలీవుడ్ లో మాంచి జోరు మీద, స్పీడు మీద వున్న నిర్మాత క్యాంప్ లో తేలారు. ఈ పెద్ద మనిషి వ్యవహారం తెలిసిన వారు ఇది చూసి కాస్త ఆశ్చర్యపోయారు. కొత్తగా పట్టేసిన నిర్మాత మాంచి సూపర్ సౌండ్ పార్టీ అని ఇప్పుడు టాలీవుడ్ అంతా చెప్పుకుంటోంది. ఆయన దగ్గర దాదాపు పది ప్రాజెక్టుల వరకు వున్నాయి.
అందువల్ల అక్కడ చేరారు కనుక ఇక ఈ పెద్ద మనిషి కార్యక్రమాలకు ఇక బ్రేక్ లు వుండకపోవచ్చు. ఈ బడా నిర్మాత దగ్గరకు చేరడానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడినట్లు వినిపిస్తోంది.
ఈ పెద్దమనిషి డీల్ చేసే విధానం చిత్రంగా వుంటుంది. ముందుగా చిన్నగా అప్రోచ్ అవుతారు. ఎవరికి దగ్గర కావాలనుకుంటారో ఆ ఆఫీసులో ఓ చిన్న పర్సన్ ను పట్టుకుంటారు. అంతే కానీ తాను నేరుగా కలవరు. ఓ సేవా కార్యక్రమానికి విరాళం అడుగుతారు. అది జరిగిన తరువాత ఇకపై ఆ నిర్మాతకు ఫోన్ లు మొదలవుతాయి. ఎవరో ఎవరో ఫోన్ లు చేయడం మొదలు పెడతారు. మీరు చేసిన పని చాలా బాగుంది. సూపర్ గా చేసారు. ఇంకా ఇంకా చేయండి అంటారు.
ఇలా ఫోన్ లు చేసే వారు రకరకాల వర్గాల వారు వుంటారు. దాంతో ఆ నిర్మాతకు ఈ ‘పెద్ద మనిషి’ ని కలవాలి అనిపిస్తుంది. అప్పుడు సదరు పెద్ద మనిషి కలుస్తాడు. దగ్గరవుతాడు. మాటల మాయలో ముంచుతాడు. కోట్లు తెలియకుండానే ఖర్చయిపోతాయి. అదీ సంగతి.