రాజకీయ నాయకులకు గిఫ్ట్ ఏమి కావాలి. పదవి ఇస్తే అంతకంటే బంగారం వజ్రం మరోటి ఉండదు. అలాంటి గిఫ్ట్ నే జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఇచ్చారని ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలమంచిలి నియోజకవర్గం సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబురాజునే మరోసారి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి ఆ పార్టీ నిర్ణయించిందట.
ఆ విషయాన్ని విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కన్నబాబురాజుకు స్వయంగా తెలియచేశారని రాజు గారి వర్గీయులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మా నాయకుడికి ఇంతకంటే పుట్టిన రోజు బహుమతి వేరే ఏముంటుందని వారు అంటున్నారు. కన్నబాబు రాజు పుట్టిన రోజును మంగళవారం వైసీపీ క్యాడర్ అంతా ఒక్కటై జరుపుకుంది.
ఈసారి కన్నబాబురాజుకు యాభై వేల ఓట్లకు తక్కువ కాకుండా గెలిపించుకుంటామని వారు అంటున్నారు. 2004, 2009, 2019లలో వరసగా మూడుసార్లు గెలిచిన కన్నబాబురాజుకు టికెట్ ఈసారి దక్కదని ప్రచారం సాగింది. అయితే ఆయనకే టికెట్ అని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించడంతో రాజా వారి వర్గం అంతా ఖుషీగా ఉంది.
ఎలమంచిలి నియోజకవర్గంలో జనసేన పోటీ చేయనుంది అంటున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేనకు ఇస్తారని అంటున్నారు. 2019లో టీడీపీ జనసేన వైసీపీల మధ్య ట్రయాంగిల్ పోరు సాగింది. ఈసారి ఫేస్ టూ ఫేస్ జనసేన వైసీపీ తలపడితే రిజల్ట్ ఎలా ఉంటుందో. వీటిని పక్కన పెడితే కన్నబాబురాజు సాధించేశారని అభిమాన జనం సంబరాలు చేసుకుంటోంది.