తలా తోకా లేకుండా.. జనం కనిపిస్తే చాలు రెచ్చిపోయి మాట్లాడడం తన సహజ అలవాటు అయిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ వాలంటీర్ల పై నోరు పారేసుకుని తన పరువు పోగొట్టుకున్నారు! గ్రామాలలో పట్టణాలలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థలో లోపాలు ఉంటే నిర్మాణాత్మక విమర్శలు చేయడం మంచిదే.
కానీ వాలంటీర్ల గురించి నీతిమాలిన, సిగ్గులేని ఆరోపణలు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ తన ఇమేజిని తానే దారుణంగా దిగజార్చుకున్నారు. ఈ విమర్శలతో బురదగుంటలోకి పూర్తిగా దిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒళ్లంతా అంటిన ఆ బురదను కడుక్కునేందుకు నానా పాట్లు పడుతున్నారు.
గ్రామాలలో మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు సహకరిస్తున్నారని నీతిమాలిన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఉద్యమంగా కదలి రోడ్లమీద పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టడం జరుగుతూ ఉంది. ఈ మాటలు కలిగించే నష్టాన్ని ఎలా పూడుచుకోవాలో పవన్ కళ్యాణ్ కు అర్థం కావడం లేదు. తాను అన్న మాటలను మీడియా గానీ, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు గానీ వక్రీకరించి చెప్పారడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన గందరగోళంలో పడ్డారు.
ఒకవైపు వాలంటీర్లను చాలా తక్కువ వేతనానికి ప్రభుత్వం దోచుకుంటున్నదంటూ వారి మీద సానుభూతి కురిపిస్తున్నారు. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ మీద త్వరలో కోర్టుకు వెళదామని జనసేన అధినేత చెబుతున్నారు. ఈ వ్యవస్థ మీద ఏ ఆరోపణతో కోర్టుకు వెళతారో బహుశా ఆయనకు సూచన మాత్రంగానైనా తెలుసో లేదో? తన మాటలు వివాదాన్ని రేపాయి గనుక వాలంటీర్ల వ్యవస్థ తప్పు అని చెప్పడానికే ఆయన ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు వాలంటీర్లు ఎవరు అని ఆలోచన రహితమైన ప్రశ్నను సంధిస్తున్నారు పవన్ కళ్యాణ్!
ప్రభుత్వం ఒంటరి మహిళలకు గాని, వితంతువులకు గాని, అవివాహితులకు గాని, వృద్ధులకు గాని సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే క్షేత్రస్థాయిలో వారి వివరాలు సేకరించకుండా ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి వివరాల నమోదులో ఎలాంటి మతలబులు జరగకుండా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి చేరవేస్తుండగా ఆ పద్ధతిని పవన్ కళ్యాణ్ తప్పుబడుతున్నారు.
ఎవరూ సేకరించకపోతే ప్రభుత్వం వద్దకు సమాచారం ఎలా వస్తుంది? వాలంటీర్ల రూపంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఈ వివరాలు సేకరించాలని పవన్ భావిస్తున్నారా? ఆయన బుద్ధి వికసించింది అంతేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది!
సంక్షేమ పథకాల సక్రమ అమలు కోసం అందులో లోటుపాట్లు దొర్లకుండా ఉండడం కోసం వివరాల సేకరణకు వాలంటీర్ల వ్యవస్థను వినియోగిస్తుంటే.. దానిని తప్పుపడుతున్న పవన్ కళ్యాణ్ అజ్ఞానాన్ని భగవంతుడే క్షమించాలని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి అజ్ఞానిని ముఖ్యమంత్రి కాదు కదా ఎమ్మెల్యే చేసినా కూడా ఆ నియోజకవర్గం సర్వనాశనమవుతుందని అభిప్రాయం పలువురికి కలుగుతోంది.