తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ప్రస్తుతం వణుకు పుడుతోంది. అమిత్ షా ఖమ్మం సభకు ముహూర్తం ఖరారు అయింది. ఢిల్లీ స్థాయి ప్రముఖ నాయకులు తెలంగాణలో పర్యటనలకు రకరకాల ముహూర్తాలు నిర్ణయించిన నేపథ్యంలో.. నిజానికి తొలి సభ ఖమ్మంలోనే జరగాల్సి ఉండింది.
ఖమ్మం సభకు సకల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే ఒక్కరోజు ముందుగా ఆ పర్యటన రద్దయింది. గుజరాత్ వరదల నేపథ్యంలో అమిత్ షా సభను రద్దుచేసుకున్నారు. తర్వాత నడ్డాసభ, మోడీ సభ కూడా పూర్తయిపోయాయి. తీరా ఇప్పుడు అమిత్ షా సభకు మళ్లీ షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 29న జరగనుంది. కాగా, ఆ సభ ఏర్పాట్ల విషయంలో కమలదళం కంగారు పడుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సహజంగానే ఖమ్మం జిల్లాలో బిజెపికి ఉన్న ఆదరణ తక్కువ. ఆ విషయాన్ని బిజెపి సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ గతంలోనే స్పష్టంగా చెప్పారు. ఖమ్మం జిల్లాలో వారికున్న బలం తక్కువ గనుకనే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక కోసం విపరీతంగా ఆరాటపడ్డారు. అయినా వర్కవుట్ కాలేదు. అలాంటి ఖమ్మంలో అమిత్ షా సభను విజయవంతం చేయడం అనేది ఇప్పుడు వారికి కత్తి మీద సాముగా మారుతోంది.
భారాస ఏర్పడిన తర్వాత.. పార్టీ ఆవిర్భావ సభను కూడా కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఖమ్మం జిల్లాలోనే నిర్వహించారు. విపరీతమైన జనసమీకరణతో ఆ సభ సక్సెస్ అయింది. పొంగులేటి చేరిక, భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భాలను ముడిపెట్టి కాంగ్రెస్ పార్టీ భారీస్థాయిలో జనగర్జన సభను కూడా ఖమ్మంలోనే నిర్వహించింది. దీనిని కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా చేశారు. ఆ రెండు సభలు సక్సెస్ కావడమే ఇప్పుడు.. కమల నాయకుల కంగారుకు కారణంగా ఉంది.
కేసీఆర్ సభ నిర్వహించినప్పుడు పొరుగు జిల్లాలు మాత్రమే కాకుండా, ఏపీ నుంచి కూడా జనసమీకరణ చేశారు. కాంగ్రెస్ సభకు ఏపీనుంచి వచ్చిన వారి సంఖ్య తక్కువే అయినా జనసమీకరణ జరిగింది. వాటితో పోలిస్తే.. ఏపీలో కూడా బిజెపి బలహీనంగానే ఉంది. అక్కడినుంచి జనాన్ని సమీకరించడం కూడా కష్టమే. ఖమ్మం, పొరుగున ఉన్న నల్గొండ జిల్లాల్లో కూడా బిజెపి బలం అంతంత మాత్రం.
జనసమీకరణలో భారాస, కాంగ్రెస్ సభలకు ఏమాత్రం తగ్గినా సరే.. రాష్ట్ర నాయకులకు హైకమాండ్ తలంటు పోయడం గ్యారంటీ. అందుకే పార్టీ నాయకులు భయపడుతున్నారు.