ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను ఎట్రాక్ట్ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడీ దర్శకుడితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే వీళ్లందరి కంటే కాస్త ముందున్నాడు నితిన్. అజయ్ భూపతిని నితిన్ లాక్ చేసినట్టు తెలుస్తోంది.
కొత్త టాలెంట్ కనిపిస్తే లాక్ చేయడంలో బెల్లంకొండ తర్వాత నితిన్ దే స్థానం. మొన్నటికిమొన్న ఛలో సినిమాతో హిట్ కొట్టిన వెంకీ కుడుములను తన నెక్ట్స్ సినిమాకు దర్శకుడిగా తీసుకున్నాడు. ఇప్పుడు అజయ్ భూపతిని లైన్లో పెట్టాడు.
నిజానికి అజయ్ భూపతి కోసం ట్రై చేసిన లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఇతడితో సినిమా చేసేందుకు రామ్ ప్రయత్నించాడు. ఈ మేరకు అడ్వాన్స్ ఇచ్చేందుకు స్రవంతి రవికిషోర్ ప్రయత్నించాడు. మరోవైపు సురేష్ బాబు కూడా రంగంలోకి దిగాడు. తరుణ్ భాస్కర్ టైపులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని భావించాడు. వీళ్లతో పాటు ఇతడికి ఓ భారీ బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది.
వీటిలో నితిన్ ఆఫర్ వైపే అజయ్ భూపతి మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నితిన్ తండ్రి సుధాకర రెడ్డి మీడియాకు లైట్ గా లీకులిచ్చాడు. ఓ సర్ ప్రైజింగ్ డైరక్టర్ తో నితిన్ నెక్ట్స్ సినిమా ఉంటుందంటూ హింట్ ఇచ్చాడు.
రీసెంట్ గా శ్రీనివాస కల్యాణం సినిమా పూర్తిచేసిన నితిన్, త్వరలోనే వెంకీ కుడుములతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వెంకీ కుడుముల సినిమా తర్వాత అజయ్ భూపతి సినిమానే ఉండొచ్చు.