తనయుడిని పరిచయం చేసే విషయంలో నాగార్జున ఒకసారి తప్పు చేసారు. జోష్ చిత్రంతో నాగ చైతన్యని పరిచయం చేయడం మిస్టేక్ అని నాగార్జున పలుమార్లు చెప్పారు. అదే తప్పు అఖిల్ తొలి సినిమా విషయంలో జరగకూడదని నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారు. హాట్ షాట్ డైరెక్టర్ వినాయక్‌తో అఖిల్ పరిచయానికి అన్ని ఒప్పందాలు జరిగిపోయాయి.
అయితే ఈ చిత్రం కథ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. కథ తనకి వంద శాతం సంతృప్తిని ఇచ్చేవరకు ఈ చిత్రాన్ని మొదలు పెట్టకూడదని నాగార్జున నిర్ణయించుకున్నారు. అందుకే దర్శకుడు ఎవరనేది ఫిక్స్ అయినా కానీ ఇంతవరకు దాని గురించి అధికారికంగా ప్రకటించలేదు. అఖిల్ కూడా తన ఫస్ట్ మూవీ బ్లాక్‌బస్టర్ అవ్వాలని కలలు కంటున్నాడు.
అఖిల్ పరిచయం మాత్రం వచ్చే ఏడాదిలో జరిగిపోవడం ఖాయం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దీనిని విడుదల చేస్తారు. వినాయక్ ప్రస్తుతం తన అనుభవం అంతటినీ రంగరించి అఖిల్ కోసం పక్కా కమర్షియల్ స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్తున్నాడు.