ఎన్టీఆర్ మహానటుడు. ప్రజల మన్నన పొందిన రాజకీయ నాయకుడు. సంక్షేమ రాజకీయాలకు బీజం వేసిన వాడు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో చిన్న మచ్చ. ముదిమి మీద పడిన తరువాత మళ్లీ పెళ్లి చేసుకున్నారన్నది. అయితే దీనికి సమాధానం కూడా ఎన్టీఆర్ బహిరంగంగానే చెప్పారు. తనకు వయసు మీద పడిందని, తనను చూసుకునేవారు లేరని, అందుకే చేసుకుంటున్నానని బహిరంగ సభలో చెప్పారు. అయితే ఆ పెళ్లి కారణంగానే ఆయన అధికారానికి, తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారని కామెంట్లు వున్నాయి. మొత్తం మీద ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం మీద ఆ రెండో పెళ్లి మచ్చ కొంత వుంది.
అందుకే బయోపిక్ లో ఆ మచ్చ చెరిపేసి, ఎన్టీఆర్ ప్రేమ ఎలాంటిదో? ఆయన తన మొదటి భార్యను ఎంతగా ప్రేమించారో? సినిమా రంగంలోకి రాకముందే తన జీవితంలోకి వచ్చిన బసవతారకంతో ఆయన ప్రేమాను రాగాలు ఎలా వుండేవో? అవన్నీ ఇప్పుడు బయోపిక్ లో చూపించబోతున్నారట. అంటే ఎన్టీఆర్-బసవతారకం ల మధ్య వున్న ప్రేమానురాగాలను కాస్త డిటైల్డ్ గానే చిత్రీకరిస్తారన్నమాట. ఓ పాట కూడా వుంటుందని తెలుస్తోంది.
జనాలకు ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచే తెలుసు. అందుకే వారికి తెలియంది, ఎన్టీఆర్ కు బసవతారకం కు పెళ్లికి ముందు అనుబంధం, పెళ్లి తరువాత ప్రేమ అన్నీ వివరంగా చూపించే విధంగా స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నారు. ఆ విదంగా ముదిమి వయసులో మళ్లీ పెళ్లి చేసుకుని, ఎన్టీఆర్ మూట కట్టుకున్న విమర్శలు అన్నీ పక్కకు పోయేలా ప్లాన్ చేసారని తెలుస్తోంది.