ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’తో సేఫ్‌ గేమ్‌

'కథానాయకుడు' అంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌ టీమ్‌. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌లో బాలకృష్ణ, స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో కన్పించనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాని బాలకృష్ణే నిర్మిస్తుండడం మరో విశేషం.…

'కథానాయకుడు' అంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌ టీమ్‌. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌లో బాలకృష్ణ, స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో కన్పించనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాని బాలకృష్ణే నిర్మిస్తుండడం మరో విశేషం. అయితే, ఎన్టీఆర్‌ బయోపిక్‌ అనగానే చాలామందిలో చాలా ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే, ఓ మాంఛి కమర్షియల్‌ ఫార్ములాకి తగ్గ కంటెంట్‌ 'ఎన్‌టిఆర్‌' జీవితంలో దొరుకుతుంది కాబట్టి. నిజానికి, బోల్డన్ని సినిమాలు తీసేకొచ్చు.. ఎన్టీఆర్‌ జీవితం మీద.

ఎన్టీఆర్‌ ఛరిష్మా మాత్రమేకాదు.. ఎన్టీఆర్‌ రాజకీయంగా పతనమైన సందర్భాన్నీ తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అలా ఎన్టీఆర్‌ పతనానికి కారణమైన వ్యక్తి ఇంకెవరో కాదు, టీడీపీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడు. ఆ 'వెన్నుపోటు' ఎపిసోడ్‌ని టచ్‌ చేయకుండానే 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌ పూర్తి చేసెయ్యాలన్నది బాలయ్య హుకూం. ఆ కారణంగానే, దర్శకుడు తేజ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కథనాయకుడిగా స్వర్గీయ ఎన్టీఆర్‌ గురించి కొత్తగా చెప్పడానికేముంది.? తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆయన్ని ఏదో ఒకరకంగా స్మరించుకుంటూనే వున్నారు. కృష్ణుడంటే ఎన్టీఆర్‌.. రాముడంటే ఎన్టీఆర్‌.. తెలుగు ప్రజల మైండ్‌లో అలా ఎన్టీఆర్‌ బొమ్మ ఫిక్సయిపోయిందంతే. అందుకే 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌కి 'కథానాయకుడు' అని పేరుపెట్టి వుండొచ్చు.

మరి, రెండోకోణం సంగతేంటి.? జనవరి 9న 'కథానాయకుడు' విడుదలవుతోంది. రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారం నేపథ్యంలో, ఆ రెండో పార్ట్‌కి పెట్టబోయే టైటిల్‌ ఏంటన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తాజాగా విన్పిస్తోన్న గాసిప్స్‌ ప్రకారం, 'కథానాయకుడు' జనవరి 9న విడుదల కానుండగా, ఆ సినిమా ఫలితాన్ని బట్టి.. సెకెండ్‌ పార్ట్‌ రిలీజ్‌ని ప్లాన్‌ చేస్తారట. అదీ, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చేలా మొత్తం స్కెచ్‌ని డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. అంటే, ముందు సేఫ్‌ గేమ్‌ అన్నమాట.. ఆ తర్వాతే అసలు కథ అన్నమాట.