విజయ్.. సూపర్ స్టార్ అండర్ మేకింగ్

ఓవర్ నైట్ స్టార్ అయిపోయాను అంటే ఎలా? ఎంత స్ట్రగుల్ పడ్డానో నాకు తెలుసు అన్నాడు ఆ మధ్య ఓ మీడియా చిట్ చాట్ లో హీరో విజయ్ దేవరకొండ. అది నిజమే. కానీ…

ఓవర్ నైట్ స్టార్ అయిపోయాను అంటే ఎలా? ఎంత స్ట్రగుల్ పడ్డానో నాకు తెలుసు అన్నాడు ఆ మధ్య ఓ మీడియా చిట్ చాట్ లో హీరో విజయ్ దేవరకొండ. అది నిజమే. కానీ విజయ్ సినిమాల విజయాల కన్నా అతని ఇమేజ్ పెద్దదిగా మారిపోయింది ఇప్పుడు. సాధారణంగా సూపర్ స్టార్ లకే ఇలాంటి వ్యవహారం వుంటుంది. రజనీకాంత్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్లకు జయాపజయాలతో సంబంధం వుండదు. సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతూనే వుంటుంది. కనిపిస్తూనే వుంటుంది. అలాంటి క్రేజ్ రావడం అన్నది అందరు హీరోలకు సాధ్యం కాదు. ఇలాంటి వ్యవహారం సాధ్యమైన వాళ్లనే సూపర్ స్టార్ లు అంటారు. వీళ్లకు హిట్ లకు మించిన ఇమేజ్ వుంటుంది.

మనకు టాప్ హీరోలు చాలా మంది వున్నారు. వంద కోట్లకు పైగా వసూలు చేసే స్టామినా వున్న హీరోలు వున్నారు. కానీ వీళ్లకు హిట్ లు పడుతుంటేనే క్రేజ్ కంటిన్యూ అవుతుంటుంది. లేదూ అంటే సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతూ వుంటుంది. సూపర్ స్టార్ అంటే ఓపెనింగ్స్ వరకు ఏ ప్రభావం పడకుండా వుండే సత్తా ప్రదర్శించేవాడు మాత్రమే. తెలుగులో ఇప్పటి వరకు అది మహేష్ కు, పవన్ కే వుంది.

ఇప్పుడు ఇలాంటి ఇమేజ్ నే విజయ్ దేవరకొండ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి హీరోల సినిమాలు విడుదలయ్యే ముందు విపరీతమైన బజ్ వస్తుంది. క్రేజ్ వుంటుంది. హడావుడి వుంటుంది. కానీ సినిమా సక్సెస్ అన్నది మాత్రం విషయం మీదే ఆధారపడి వుంటుంది. మళ్లీ మరో సినిమా వచ్చినపుడు ఇదంతా మామూలే.

అయితే తెలుగు నాట చూస్తే మహేష్ తన సూపర్ స్టార్ ఇమేజ్ ను నిలబెట్టుకునే ప్రయత్నం బాగానే చేస్తున్నాడు. తనే డైరక్టర్లను పిలిచి మరీ, సినిమాలు చేయించుకుంటున్నాడు. 
పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంత ప్రయత్నించాడు కానీ, ఆయన తన విలక్షణ వ్యవహారశైలి కారణంగా కావచ్చు, తనదైన ఐడియాలజీ కారణంగా కావచ్చు, సినిమా రంగాన్నే వదిలేసారు.
ఇప్పుడు మరి విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ప్లానింగ్ ఎలా వుంటుదన్నది చూడాలి.

సినిమా సినిమాకు వైవిధ్యం చూపించే ప్రయత్నం వరకు ఓకె. కానీ సినిమా సినిమాకు మెట్టు ఎక్కే అవసరం కచ్చితంగా వుంది. ఇప్పుడిప్పుడే పెద్ద దర్శకుల కన్ను విజయ్ మీద పడుతున్నా, ప్రస్తుతం లైనప్ మాత్రం ఇంకా కొత్త, చిన్న దర్శకులతోనే వుంది. ఒప్పుకున్నవి, రాబోయేవి మొత్తం మూడు సినిమాలు వున్నాయి. వీటి తరువాతే అసలు ట్రాక్ మొదలు కావచ్చు.

చిన్న సినిమాలతోనే, చిన్న డైరక్టర్లతోనే విజయ్ ఈ ఇమేజ్ తెచ్చుకున్నాడు కదా? అన్న క్వశ్చను ఎదురుకావచ్చు. కానీ ప్రతి సారీ చిన్న సినిమా, చిన్న డైరక్టర్ విజయ్ కు సరిపడా సినిమా ఇచ్చే అవకాశం వుండొచ్చు, వుండకపోవచ్చు. అందువల్ల సరైన సబ్జెక్ట్ లతో పాటు, సరైన కాంబినేషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం వుంది.

జనం ఇప్పడు విజయ్ నామస్మరణ చేస్తున్నారు. అది అలా కంటిన్యూ అయ్యేలా చూసుకొవాల్సి వుంది. ఎందుకంటే టాలీవుడ్ ఎంతో మంది స్టార్ లను, టాప్ స్టార్ లను, చూసింది. కానీ అందరికీ అంత సులువుగా సూపర్ స్టార్ కిరీటం అందించలేదు.

నోటా సినిమా ఎలా వుంటుంది? ఏమేరకు వసూళ్లు వుంటాయి అన్నది మాత్రమే కీలకమే. ఎందుకంటే విజయ్ పూర్తి స్థాయి సూపర్ స్టార్ అనిపించుకోవాలి అంటే, వరుస హిట్ లు అవసరం. అతగాడు ఇంకా సూపర్ స్టార్ అండర్ మేకింగ్. అందువల్ల హిట్ లు డెలివర్ చేయాల్సిన బాధ్యత, అవసరం రెండూ విజయ్ మీద వున్నాయి. దాని మీదే అతగాడికి సూపర్ స్టార్ సర్టిఫికేషన్ లభిస్తుంది.