కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో వున్న సంగతి కొత్త విషయం కాదు. ఆమెకు మద్దతుగా సోదరులు నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ రంగంలోకి దిగని సంగతి కూడా కొత్త విషయం కాదు. చంద్రబాబు నిర్ణయం పట్ల వారు ఇద్దరు అసంతృప్తితో వున్నారన్న వార్తలు ఎక్కడిక్కడ బయటకు వస్తూనే వున్నాయి.
సరే, ప్రచారం అయిపోయింది, పోలింగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ మదిలో మాటలు ఇవే అంటూ ఆయనకు సన్నిహిత అభిమానుల్లోని ఒకరు ఈ కింద వాట్సప్ మెసేజ్ ను పంపించారు. కాస్త లాజికల్ గా, ఎన్టీఆర్ వైపు నుంచి ఆలోచిస్తే సబబే అన్నట్లు వున్న ఆ మెసేజ్ యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాం.
''…కుటుంబం లో చిచ్చు పెట్టాలని చూసి , కనీస సంప్రదింపు లేకుండా , బలవంతం గా బెదిరించి , అత్తవారి వైవు నుండి ఒత్తిడి తెచ్చి , స్వార్ధ రాజకీయం కోసం శవాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమ ఒలకబోస్తోన్న ఆ పెద్దాయన ను చూసి కలుగుతున్నది సంభ్రమాశ్చర్యం .
కొడుకు మీద ప్రేమ తో పార్టీ సంస్థాగత సిద్ధాంతాలను సైతం మంట గలిపి అన్నగారు పోరాడిన దుష్ట కాంగ్రెస్ తో నేడు చేతులు కలిపి కులుకుతున్న మీ చంద్రోదయానికి జోహార్లు
ఎలాగైనా అన్నదమ్ములను ఎలక్షన్ బరిలోకి లాగాలని చేసిన విశ్వప్రయత్నానికి, వారు తలొగ్గ లేదని , కనీసం ఊహించని విధంగా ఒక ఆడ కూతురిని వత్తిడి చేసి , కుటుంబం వద్దు అని చెప్తోన్నా వినకుండా రాజకీయం చేసిన మీ తెలివి అమోఘం.
హరికృష్ణ కుటుంబమని ఆదరించాలంటే ఆంధ్ర లో ఎమ్మెల్సీకి అడ్డు వచ్చిందా ? నామినేటెడ్ పదవులు వద్దన్నాయా ? పోనీ ఎలక్షన్ లో దింపాల్సిందే , అదే శేరిలింగంపల్లి లో ఎందుకు టికెట్ ఇవ్వలేదు ? అదే ఖమ్మం లో ఎందుకు టికెట్ ఇవ్వలేదు ? దాదాపు అసాధ్యం అయినా కూకట్ పల్లి లో ఎందుకు ఇచ్చారు ?
గెలిస్తే హరికృష్ణ కుటుంబాన్ని ఆదరించాం అని చెప్పొచ్చు . ఓడితే, హరికృష్ణ కుటుంబానికి ప్రజాదరణ లేదు అని ముద్ర వేయొచ్చు . బోనస్ గా అక్కకు సాయం గా అన్నదమ్ములు కనుక వస్తే, వారిని ఆంధ్ర ఎన్నికల లో వాడుకోవచ్చు .
కేవలం అక్క కు మద్దతు తెలిపి ఆంధ్రా లో ప్రచారం చేయకపోతే అన్నదమ్ములకు పార్టీ మీద ప్రేమ లేదు అని చెప్పొచ్చు . ప్రచారం చేసి గెలిస్తే అది చంద్రోదయ మహిమ అని చెప్పొచ్చు . ప్రచారం చేసినా ఓడిపోతే , జూనియర్ కి ఆదరణ లేదు , రేపు లోకేష్ యే మీ దిక్కు అని చెప్పకనే చెప్పొచ్చు ..
ఆహా .. ఏమి మీ వివేకము ఏమి ఈ విజ్ఞానము . కుటుంబాలలో చిచ్చు పెట్టి , చేతులో ఉన్న పేపర్ లలో ఇష్టం వచ్చినట్టు రాయించి , ఒక రాయితో అయిదారు పిట్ట ల ను కొట్టాలనే మీ ఆశయాన్ని చూస్తుంటే , ఆనందం తో వస్తోన్న కన్నీళ్ళని ఆపతరమా?
ఇదీ ఆ వాట్సప్ మెసేజ్. ఎన్టీఆర్ మనోగతమా కాదా? అన్నది పక్కన పెడితే ఆ అభిమాని ఆలోచన కేవలం ఒక్కరితోనే సరిపోతోందా? లేక ఎన్టీఆర్ సన్నిహితులు అంతా ఇదే రీతిగా ఆలోచిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.
ఏమయినా బాబాయ్ కు అబ్బాయ్ కు మధ్య దూరం తగ్గినా, తెలుగదేశం పార్టీకి ఎన్టీఆర్ కు మధ్య దూరం మాత్రం అలాగే వుందని క్లియర్ అవుతోంది.