నిజ జీవిత కథలు, చరిత్రలో జరిగిన సంఘటనలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కథలు చెప్పడం కంటే ఎవరైనా ప్రముఖుడి జీవిత కథ చెబితే క్రేజ్ బాగా వస్తుందని బయోపిక్స్ మీదే టాలీవుడ్ దృష్టి పెడుతోంది. సావిత్రి జీవిత కథ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేయడంతో, ఎన్టీఆర్ జీవితం కూడా తెర మీదికొస్తోంది.
మహానటి నలభై కోట్లకి పైగా షేర్ సాధిస్తే, బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎన్టీఆర్ కనీసం దానికి డబుల్ వసూలు చేయదా అని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడడానికి మాస్ ప్రేక్షకులు మరింతగా ఎగబడతారని నిర్మాతల నమ్మకం. అందుకే ఈ చిత్రానికి కనీ వినీ ఎరుగని రేట్లు చెబుతున్నారు.
బాలకృష్ణ రెగ్యులర్ మార్కెట్‌కి డబుల్ రేట్లు చెబుతూ ప్రస్తుతం టాప్‌లో వున్న హీరోల సినిమాలకి సమానమైన రేట్లకి అమ్మాలని చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ని ఎక్కువ అంచనా వేస్తున్నారా లేక నిజంగానే ఈ కథకి అంత పొటెన్షియల్ వుందా అనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరోవైపు ఈ చిత్రాన్ని సంక్రాంతికి పలు చిత్రాల నడుమ పోటీగా విడుదల చేయబోతున్నారు. అన్ని సినిమాలు బాగా ఆడి రెవెన్యూ డివైడ్ అయిపోతే రికవరీ జరుగుతుందా అని కూడా అనుమానాలున్నాయి. అయితే ఎన్టీఆర్ నిర్మాతలు మాత్రం అన్ని హక్కులూ కలుపుకుని వంద కోట్లకి తక్కువకయితే అమ్మేది లేదని ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం.