రోగీ పాలే కోరాడు..డాక్టరు పాలే తాగమన్నాడు. మరింక సమస్య ఏమిటి? అంటే వుంటుంది..ఒక్కోసారి అక్కడ కూడా సమస్య వుంటుంది.
ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని వుంది. త్రివిక్రమ్ కూడా కూడా చేస్తే బాగుండుననే వుంది. కానీ కుదరడం లేదు..ఎందుకని?
టాలీవుడ్ లో ఏమున్నా లేకపోయినా, ఇగో సమస్యలు భయంకరంగా వుంటాయి. అక్కడే ఎవరో ఒకరు పూనుకోవాలి.ఇద్దర్ని కూచో పెట్టాలి. కానీ ఎవరున్నారు..త్రివిక్రమ్ అందరు నిర్మాతలకు అందుబాటులో వుండరు. ఆయన సినిమాలు చేసేది కొద్దిమందికే. మరి ఆ కొద్దిమందే పూనుకోవాలి. అలాంటి వారిలో హారిక హాసిని రాధాకృష్ణ ఒకరు. ఆయనకు పెద్దగా అవసరం లేదు. తను వెళ్లి హీరోలను అడగడం అంటే రాధాకృష్ణకు నచ్చని పని. పైగా పవన్-త్రివిక్రమ్ సినిమా ఆయనదే. మరింక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.
ఇక భోగవిల్లి ప్రసాద్ వున్నారు. కానీ త్రివిక్రమ్ కు ఆయనకు కొంచెం తేడా వచ్చింది. మళ్లీ సెట్ అయింది. ఆయన రెండు సినిమాలు చేసే పనిలో బిజీగా వున్నారు. అల్లరి నరేష్ తో, శర్వానంద్ తో. అందువల్ల ఆయనకూ ఇప్పడేం అవసరం అంతగా లేదు. దిల్ రాజుకు చేయాలనే వుంది. త్రివిక్రమ్ ను అడుగుతున్నారు. హీరో ఎవరన్నది త్రివిక్రమ్ కే వదిలేసారు. ఇప్పుడు ఆయన వెళ్లి ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ ను కలిపే ప్రయత్నం చేస్తే, మిగిలిన హీరోలకు కాస్త గుర్రుగా వుండే అవకాశం వుంది. అజాత శతృవుగా వుండాలనుకునే దిల్ రాజు ఆ పని చేయరు.
ఇక పోనీ ఎన్టీఆర్ తనంతట తాను మెట్టు దిగి త్రివిక్రమ్ ను వెళ్లి కలిస్తే పనైపోతుంది. కానీ వెళ్తారా? అంటే అనుమానమే. కొరటాల శివ సినిమా కోసం లండన్ నుంచి సడెన్ గా వచ్చి వెళ్లారు ఎన్టీఆర్ అని నాన్నకు ప్రేమతో షూట్ సమయంలో వార్తలు వినిపించాయి. పని జరిగింది. మరి ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఓ మెట్టు దిగి వెళ్లాలే కానీ, త్రివిక్రమ్ కాదనరు. అయితే ఎన్టీఆర్ అలా చేస్తారా అన్నది అనుమానం.
ఇలా ఎవరికి వారు గిరి గీసుకుని కూర్చోవడంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ అలా వార్తల్లోనే వుండిపోతోంది.