ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఓవర్ సీస్ హక్కులు అమ్ముడయ్యాయా? లేదా? ఇదో చిత్రమైన ప్రశ్నగా వినిపిస్తోంది టాలీవుడ్ లో. హారిక హాసిని సంస్థ గత సినిమా అజ్ఞాతవాసి భయంకరమైన ఫ్లాప్ గా మిగిలింది. ఆ సినిమా కొన్న ఓవర్ సీస్ బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. సహజంగా అదే నిర్మాత మరో సినిమా చేస్తే, అంతలా నష్టపోయిన బయ్యర్ కు కాస్త తక్కువ ఇవ్వాల్సి వుంటుంది. అయితే హారిక హాసిని సంస్థ అలాంటివి ఏవీ ఆలోచించడం లేదని వినికిడి.
ఇలాంటి టైమ్ లో బ్లూ స్కై సంస్థ 18కోట్లకో 20కోట్లకో హారిక హాసిని సంస్థతో నాలుగు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు గుప్పుమన్నాయి. ఎన్టీఆర్-త్రివిక్రమ్, చైతూ-మారుతి, శర్వా-సుధీర్ వర్మ సినిమాలతో పాటు మరో సినిమా కలిపి ఈ డీల్ సెటిల్ అయిందన్నది వార్తల సారాంశం. ఆ నాలుగో సినిమా వెంకీ-త్రివిక్రమ్ దా? లేదా? సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించే మరో చిన్న సినిమా కలిపినా? అన్నదాంట్లో క్లారిటీ లేదు.
నిజానికి ఎన్టీఆర్ కు బ్రహ్మాండమైన ఓవర్ సీస్ మార్కెట్ లేదు. సుకుమార్, కొరటాల లాంటి వారు కలిసినా ఎన్టీఆర్ ఓవర్ సీస్ మార్కెట్ మరీ అద్భుతంగా కుమ్మేసింది లేదు. ఇప్పటికీ నాన్నకు ప్రేమతో సినిమానే హయ్యస్ట్ అనుకోవాలి. ఇక త్రివిక్రమ్ మార్కెట్ అన్నది సినిమా తేడా వస్తే ఎలా వుంటుందో అజ్ఞాతవాసి చెప్పనే చెప్పింది.
చైతూ-మారుతి, శర్వా-సుధీర్ వర్మ సినిమాల రేంజ్ ఎంత అన్నది తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో 18నుంచి 20కోట్ల ఆఫర్ నిజంగానే వచ్చిందా? ఫైనల్ అయిందా? అన్నది అనుమానం. కానీ ఫైనల్ అయిపోయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అయితే ఎవరికీ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. హారిక హాసిని సంస్థ ఆశిస్తున్నంత రేటు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావకపోవడంతో, డీల్ ను ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.
డిస్కషన్లు నడుస్తున్నాయి కానీ, ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మరి ఎంతకు ఫైనల్ అవుతుందో చూడాలి. ఎంతకు అమ్మినా ఓవర్ సీస్ లో కాస్త గట్టి పట్టు వున్న ఒకరిద్దరు బయ్యర్లతోనే డీల్ చేయాలని హారిక హాసిని సంస్థ చూస్తున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి విషయంలో కొత్త బయ్యర్ కు ఇచ్చి, అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నామని, ఓవర్ సీస్ లో కొత్త బయ్యర్లకు పెద్ద సినిమాలు ఇస్తే, సెటిల్డ్ బయ్యర్లతో అనుకోని రకమైన ఇబ్బందుల తలెత్తుతున్నాయని, అందుకే ఈ సారి ఆచి తూచి డీల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో భరత్ అనే నేను ఓ ఎగ్జాంపుల్ గా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు వేరే బయ్యర్ ఎవరైనా అయి వుంటే, పరిస్థితి వేరుగా వుండేదని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.