ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంఛ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్, బాలయ్య, కల్యాణ్ రామ్ కలిశారు. తండ్రి గురించి బాలయ్య, తాత గురించి ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ అనర్గలంగా మాట్లాడేశారు. సినిమా విడుదల ముందు కాబట్టి వీళ్లు ముగ్గురూ ఏం మాట్లాడినా చెల్లింది. కానీ ఈసారి వీళ్లు ముగ్గురూ కలిసి ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయింది మరి.
బయోపిక్ 2 భాగాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఒకదాన్ని మించి మరొకటి 'లెజెండ్' డిజాస్టర్లుగా పేరుతెచ్చుకున్నాయి. సాధారణంగా ఇలాంటి డిజాస్టర్ తర్వాత కొన్నాళ్ల పాటు హీరోలు కెమెరా ముందుకురారు. కానీ ఆశ్చర్యకరంగా నందమూరి హీరోలు ముగ్గురూ ఒకే వేదికపైకి వస్తున్నారు.
118 సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం మరోసారి బాలయ్య, తారక్, కల్యాణ్ రామ్ కలవబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఈ ముగ్గురూ ఒకే వేదికపైకి రాబోతున్నారు. రెండు భారీ డిజాస్టర్ల తర్వాత ఒకే వేదికపైకి రాబోతున్న వీళ్లు ముగ్గురు బయోపిక్ గురించి ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన తీసుకురాకుండా చేయాలనేది వీళ్ల ముగ్గురి ఆలోచనగా ఉంది. బయోపిక్ తో డీలా పడిన ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేందుకు ఈ ముగ్గురూ ఇలా కావాలని కలుస్తున్నారట. అయితే బాలయ్య మైక్ అందుకుంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ముగిస్తాడనేది ఎవరికీ తెలీదు.
నిజానికి అతడికి కూడా తెలీదు. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన కచ్చితంగా వచ్చితీరుతుందని చాలామంది వెయిటింగ్. బయోపిక్ తో ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి అతడు ఈ సినిమా గురించి మాట్లాడకపోవచ్చు. కల్యాణ్ రామ్, బాలయ్య మాత్రం బయోపిక్ డిజాస్టర్ పై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే.