సైరా సాక్షిగా మెగా ఆక్రమణ?

సైరా సినిమాలో బ్రిటిష్ వాళ్ల ఆధీనంలో ఉన్న కోటను సక్సెస్ ఫుల్ గా ఆక్రమించుకుంటాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దానికి సంబంధించిన సన్నివేశాల్ని కూడా ఈమధ్యే నైట్ ఎఫెక్ట్ లో తీశారు. ఇప్పుడిలాంటి కబ్జానే రియల్…

సైరా సినిమాలో బ్రిటిష్ వాళ్ల ఆధీనంలో ఉన్న కోటను సక్సెస్ ఫుల్ గా ఆక్రమించుకుంటాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దానికి సంబంధించిన సన్నివేశాల్ని కూడా ఈమధ్యే నైట్ ఎఫెక్ట్ లో తీశారు. ఇప్పుడిలాంటి కబ్జానే రియల్ లైఫ్ లో కూడా చేయడానికి ప్రయత్నించిందట మెగా కాంపౌండ్. కానీ ఆ ప్రయత్నం మాత్రం సక్సెస్ కాలేదు. 

మేటర్ ఏంటంటే.. హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లిలో దాదాపు ఏడాదిన్నర కిందట ఓ సెట్ వేశారు. అది రంగస్థలం కోసం వేసిన సెట్. సినిమా షూటింగ్ పూర్తయింది, రిలీజ్ కూడా అయింది. కానీ ఆ సెట్ మాత్రం తీయలేదు. పైపెచ్చు ఇప్పుడు అదే సెట్ లో సైరా నరసింహారెడ్డి షూటింగ్ చేస్తున్నారు.

సినిమాలో నరసింహారెడ్డి ఇంటికి సంబంధించిన విజువల్స్ ను రంగస్థలం సెట్ లో తీశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాస్త ఖర్చు తగ్గించేందుకు ఇలా రంగస్థలం సెట్ ను వాడుకుంటున్నారని అంతా అనుకున్నారు. కానీ సెట్ ను కొనసాగించే ముసుగులో ఏకంగా భూ ఆక్రమణకు తెరదీశారని ఆరోపిస్తున్నారు రెవెన్యూ అధికారులు. 

శేరిలింగంపల్లిలో సైరా కోసం వాడుకుంటున్న ఈ సెట్ ను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి. ఇందులో సెట్ వేయడం కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదట. అయినప్పటికీ ఓపిగ్గా ఎదురుచూసిన అధికారులు, పలుమార్లు నోటీసులు కూడా పంపించారు. కానీ ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో సెట్ ను కూల్చేసినట్టు చెబుతున్నారు. 

ఈమధ్య భూఆక్రమణల్లో ఇదొక కొత్త పద్ధతిగా చెబుతున్నారు అధికారులు. ఏదైనా ఈవెంట్లు లేదా షూటింగ్స్ కోసం స్థలాన్ని తీసుకొని, పని పూర్తయిన తర్వాత కూడా ఖాళీ చేయకుండా అలానే కొనసాగించి కొన్నాళ్లకు తమ వశం చేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు. నగర శివార్లలో ఇలా చొరబాట్లకు గురైన ప్రభుత్వ భూములు కొన్నింటిని స్వాధీనం చేసుకుంటున్నామని, ఇందులో భాగంగానే సైరా సెట్ వేసిన భూమిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు అధికారులు ప్రకటించారు. 

మరోవైపు సెట్ కూల్చేసినా సైరా షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. ఈ సెట్ లో తీయాల్సిన సన్నివేశాల్ని ఇప్పటికే షూట్ చేసిందట సైరా యూనిట్.