ఒక్కోసారి ఒక్కో నిర్ణయం సినిమా భవిష్యత్ ను మార్చేస్తుంది. నిర్మాత దిల్ రాజు తీసుకున్న ఇలాంటి నిర్ణయమే ఎంసిఎ సినిమాకు బాగా ప్లస్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. వాస్తవానికి ఎంసిఎ సినిమాను డిసెంబర్ 15న విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ వర్క్ ఫినిష్ కాకపోవడం, వరుస సెలవుల సీజన్ ముందు కనిపించి, నిర్ణయం మార్చుకున్నారు. డిసెంబర్ మూడో వారంలో రావాలని అనుకున్నారు. మామూలుగా అయితే శని, ఆది, సోమ సెలవులు కాబట్టి, శుక్రవారమే విడుదల చేస్తారు. కానీ దిల్ రాజు, మరో ఆలోచన చేసి, గురువారమే విడుదలకు రెడీ అయ్యారు.
శుక్రవారం అఖిల్ సినిమా హలో వుంది. ఎలాగూ ఆ సినిమా వున్నా కూడా విడుదల చేయాలని అనుకున్నపుడు శుక్రవారమే విడుదల చేస్తారు. కానీ గురువారం విడుదలకే దిల్ రాజు మొగ్గు చూపారు. నిజానికి ఇక్కడ రిస్క్ వుంది. ఫలితం తేడా తేడా వస్తే, శుక్రవారం నాడు రెండో సినిమా వచ్చి, చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ దిల్ రాజు, నాని, సాయిపల్లవి క్రేజ్ ను దృష్టిలో వుంచుకుని, ఆ మేరకు వీలయినన్ని ఎక్కువ స్క్రీన్ లు వేసి, మాంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అమలు చేసారు.
దీంతో తొలిరొజు హీరో, హీరోయిన్ల క్రేజ్ క్లియర్ గా కనిపించి, మాంచి వసూళ్లు దక్కాయి. దాదాపు మూడుకోట్లకు పైగా తేడా కనిపించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అదే కనుక శుక్రవారం విడుదల చేసి వుంటే రెండు సినిమాలు షేర్ చేసుకుని వుండేవి.
ఎంసిఎ టోటల్ రన్ లో ఆ మూడుకోట్ల తేడా ప్లస్ అయివుండేది కాదు. ఇప్పుడు ఆ టాక్, ఆ కలెక్షన్ల ప్లస్ అలా కంటిన్యూ అయింది. శుక్రవారం కాస్త కలెక్షన్లు షేర్ చేసుకున్నా, శని, ఆది, సోమ వారాలు ఫుల్స్ తో దూసుకుపోయింది. ఆ విధంగా దిల్ రాజు నిర్ణయం సినిమాకు ప్లస్ అయింది.