ఓ హిట్ వస్తే పైకి మెచ్చుకుంటారు. లోపల మాత్రం గోతులు తవ్వుతారు. వీడికి మరో హిట్ రావడానికి వీల్లేదన్నట్టుగా పావులు కదుపుతుంటారు. ఇండస్ట్రీని దగ్గరుండి గమనించే వ్యక్తులకు ఈ గోతులు తవ్వే వ్యవహారాలు బాగా తెలుస్తాయి. అలాంటి ఓ బ్యాచ్ ఇప్పుడు విజయ్ దేవరకొండపై తమ ప్రతాపం చూపిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచీ ఎందుకో ఈ బ్యాచ్ డియర్ కామ్రేడ్ పై పడి ఏడుస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు తగినశాస్తి జరగాల్సిందే, యాటిట్యూడ్ ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది, ఒక్క ఫ్లాపొస్తే సక్కగౌతాడు, అప్పుడే అయ్యగారికి నాలుగు భాషలు అవసరమా? ఇలాంటి కామెంట్లు చాలానే బైటకొస్తున్నాయి.
అమెరికాలో షోలు పడినప్పట్నుంచే ఈ బ్యాచ్ తమ పని స్టార్ట్ చేసింది. విజయ్ దేవరకొండ ఎక్కడ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోతాడో అనే భయం ఈ బ్యాచ్ లో కనిపించింది. అందుకే సినిమాపై బురుదజల్లడమే పనిగా పెట్టుకుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. అభిమానుల సంఖ్య పెరిగేకొద్దీ, ద్వేషించేవారి సంఖ్య కూడా ఆటోమేటిగ్గా పెరుగుతుంది, ఇది సహజ పరిణామమే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అందరూ అభిమానులుగా మారాలంటే దానికి కచ్చితంగా టైమ్ పడుతుంది. ఈ సంధికాలంలో ఉన్నాడు కాబట్టే, విజయ్ దేవరకొండపై ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి.
అందులోనూ ముక్కుసూటితనం చాలామందికి నచ్చదు. ఎదగాలంటే ఒదగాలి, వంగాలి.. అనే డైలాగులు విజయ్ దేవరకొండకు నచ్చవు. సో.. ఇలాంటి సంఘర్షణల ప్రభావం ఆయన సినిమా ఫలితంపై కనపడుతోంది. సినిమా చూసిన వాళ్లకంటే చూడని వాళ్లు స్ప్రెడ్ చేసిన టాక్ ఎక్కువగా ఉంది అనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ బ్యాచ్ పనిగట్టుకుని మరీ సినిమాని, హీరో యాటిట్యూడ్ ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంది. మొదటిరోజు వాళ్లు సక్సెస్ అయ్యారు కూడా.
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు, అతని మార్కెట్ ఏమీ పడిపోలేదు. మొదటిరోజు వసూళ్లే దీనికి ఉదాహరణ. ఇలాంటి కామెంట్స్ ని కామ్రేడ్ లెక్కచేస్తాడని కూడా చెప్పలేం. ఏదేమైనా.. విజయ్ సినిమాపై నెగెటివ్ గా స్పందించడానికి కొంతమంది ఎంతకసిగా ఎదురు చూశారనే విషయం మాత్రం తొలిరోజే స్పష్టమైంది. బాధాకరమైన విషయం ఏంటంటే.. వాళ్లంతా సామాన్య ప్రేక్షకులు కాదు, ఇండస్ట్రీకి చెందిన కొన్ని గ్రూపులు.