మీరు మీ సినిమాలను మీ ఇష్టం వచ్చిన టికెట్ రేట్లకు ప్రదర్శిస్తారు. చూసే వాళ్లు చూస్తారు. చూడలేని వాళ్లు చూడరు.
మల్టీ ఫ్లెక్స్ ల్లో ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముతారు, తినుబండారాలు అమ్ముతారు. కొనుక్కునే వాళ్లు కొనుక్కుంటారు. కొనలేని వాళ్లు ఊరుకుంటారు.
ఇవన్నీ కలిసి చివరకు చేసేదేమిటి? జనాలను థియేటర్ కు దూరంగా వుంచడం. హాలీవుడ్ సినిమాల్లో సీన్లను చూసి, లైన్లను చూసి, ఫ్రీగా ఎత్తేస్తున్నారు సినిమా జనాలు. ఎవరైనా ఏమైనా అంటే ఇన్ స్పయిర్ అయ్యాం అంటున్నారు. సినిమాలు తక్కువలో ఖర్చు పోయేందుకు వీలుగా, కాపీ రైట్ తీసుకోకుండా ఇన్ స్పయిర్ అయ్యాం అని అనొచ్చు. అంతే కానీ రోజు కూలీతోనో, చాలీ చాలని జీతాలతోనో బతికే బడుగు జీవులు పైరసీ సీడీ చూడకూడదు.
కోట్లు పెట్టి సినిమా తీసాం, తమకు లాస్ అని సినిమా జనాలు అనొచ్చు. కోట్ల వ్యాపారం ఇది. ఇందులో పైరసీ అనే రిస్క్ వుంటుంది. ఆ రిస్క్ వున్నా కూడా కోట్ల లాభాలు వచ్చిన సినిమాలు వున్నాయి. అస్సలు ఆడక కోట్లు పోయిన సినిమాలు వున్నాయి. పైరసీ వల్ల పోయిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టేటన్ని వుంటాయి. హిట్ అయిన సినిమాలను ఏ పైరసీ ఆపలేకపోయింది. దాని వల్ల కనిపించని లాస్ వుంటే వుండొచ్చు. కానీ హిట్ అయిన సినిమాలు అన్నీ లాభం చేసుకున్నవే. అస్సలు జనం చూడని చిన్న సినిమాలకు పైరసీ చేసి ఫ్రీగా పంచుకోవాలి కానీ, కొనేవాడు వుండడు.
మరింక పైరసీ బాధ ఎవరికి? పెద్ద సినిమాకు, చిన్న సినిమా, హిట్ సినిమాకు ఫ్లాప్ సినిమాకు కాదు, కేవలం ఏవరేజ్ సినిమాకు మాత్రమే కాస్త సమస్య. ఇప్పుడు దర్శకుడు బివిఎస్ రవి ఇంత రేంజ్ లో రంకెలు వేయడం చూస్తుంటే అనుమానంగా వుంది. మూడో రోజుకే బివిఎస్ రవి ఇలా అంటున్నారు అంటే, మండే నుంచి జవాన్ కలెక్షన్లు తగ్గితే ఆ నెపాన్ని పైరసీ మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పైగా ఆ ఆవేశం మరీ ఎక్కువగా వుంది. ఆవేశంలా లేదు. సినిమాకు ఏదో అయిపోతోందన్న ఆక్రోశంలా వుంది. అమ్మకీ అబ్బకీ పుట్టని వాళ్లు అని పైరసీ జనాలను అనడం అంటే ఆక్రోశమే. బివిఎస్ రవికి ఇది చావు బతుకుల సినిమా. ఈ సినిమా నిర్మాతకు కాస్త ఊపిరి ఇస్తేనే మరో సినిమా రవికి వస్తుంది. బహుశా ఆ ఆందోళనే రవి చేత ఈ విధంగా మాట్లాడించి వుంటుంది. ఏమయినా తన మిత్రుడు హరీష్ శంకర్ డిజె సినిమా టైమ్ లో మీడియా మీద విమర్శలు చేసారు. ఇప్పుడు రవి పైరసీ కారులపై విరుచుకుపడ్డారు. మొత్తానికి ఫ్రెండ్స్ ఇద్దరూ భలే ఎగ్రెసివ్ జనాలే.