వెంకీమామ.. ఈ సినిమా మీదనే ఇప్పుడు హీరో నాగచైతన్య ఆశలు అన్నీ. ఎందుకంటే యాక్షన్ సినిమాగా, దర్శకుడు చందు మొండేటికి అతిగా నమ్మిచేసిన సవ్యసాచి దారుణాతి దారుణంగా దెబ్బతీసింది. తరువాత చేస్తున్న శివనిర్వాణ డైరక్షన్ లోని సినిమా కాస్త సీరియస్ వ్యవహారం. ఇద్దరు హీరోయిన్లు, పెళ్లాం మొగుళ్ల మధ్య భారీ ఎమోషన్లు వగైరా వుంటాయి. అందువల్ల ఆ ఎమోషన్లను నాగచైతన్య పండించడం బట్టి వుంటుంది రిజల్ట్.
ఇక మిగిలింది అంకుల్ విక్టరీ వెంకటేష్ తో కలిసి చేయబోయే వెంకీమామ. ఈ సినిమాకు దర్శకుడు బాబీ. పీపుల్స్ మీడియా, కోన వెంకట్, సురేష్ బాబు కలిసి నిర్మించే సినిమా. బాబీని డైరక్టర్ గా అనుకున్నపుడే కాస్త జనాలకు అనుమానం వచ్చింది. కోన వెంకట్ కథేమిటి? టక్కున డైరక్టర్ ను మార్చి, బాబి చేతిలో పెట్టడం ఏమిటి? అని.
అయితే ఇప్పుడు ఓ విషయం గ్యాసిప్ గా బయటక చక్కర్లు కొడుతోంది. వెంకీ మామ కథ ఒరిజినల్ కాదని, రీమేక్ అన్నది ఆ గ్యాసిప్. అందుకే బాబీని తీసుకున్నారని టాక్. పంజాబీ సినిమానో, మరోటో కోన వెంకట్ తెలుసుకుని రైట్స్ తీసుకున్నారని, అది అవుట్ అండ్ అవుట్ రీజనల్ కామెడీ మాదిరిగా వుంటుందని, దాన్ని ఇప్పుడు తెలుగుకు సరిపడే విధంగా స్క్రిప్ట్ వండుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ స్క్రిప్ట్ వంటకం ప్రతి దశలోనూ సురేష్ బాబు ఓకె చేయాల్సి వుండడంతోనే, లేట్ అవుతోందని కూడా వినిపిస్తోంది. మామూలుగా వండడం అయితే ఓకె. కానీ సురేష్ బాబు పూర్తిగా నచ్చేలా వండాలి అంటే అది అంత సులువుగా అయ్యే పనికాదు.
కోన వెంకట్ గతంలో కూడా నిఖిల్ తో శంకరాభరణం సినిమా కోసం ఓ చిన్న హిందీ సినిమాను కొని తీసుకువచ్చి, మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ కథ ఎలా మార్పులకు నోచుకుంటుందో? ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.
ఆసక్తిదాయకంగా 'పోల్ తెలంగాణ'… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్