తెలంగాణ థియేటర్లలో పార్కింగ్ చార్జీలు తీసేసిన సంగతి తెలిసిందే. దీనిపై మళ్లీ కుట్ర జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు దొడ్డిదోవన ఈ పార్కింగ్ చార్జీలు ఎలాగైనా ప్రవేశపెట్టించాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వంలో తమకు వున్న పలుకుబడిని వాడుకుని ఏదో రూపంలో పార్కింగ్ చార్జీలను మళ్లీ ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా జీవో తెప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం బయటకు కాస్త పొక్కడంతో, సినిమా ప్రేక్షకుల సంఘాల పేరిట ప్రభుత్వానికి వినతిపత్రాలు మొదలైనవి మొదలయ్యాయి. అయితే ప్రభుత్వంతో తమకు వున్న సాన్నిహిత్యం వర్కవుట్ అవుతుందని నైజాంలో థియేటర్లను చేతిలో వుంచుకున్న వర్గాలు ధీమాగా వున్నట్లు తెలుస్తోంది.
పార్కింగ్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసినా, కొన్నిచోట్ల ఇంకా ఏదో రూపంలో వసూలు చేస్తున్నారు. పార్కింగ్ చార్జీలు అని జీవోలో వుంటే, వేరే వేరే పేర్లు కనిపెడుతున్నారు. అందుకే పార్కింగ్ ప్లస్ మెయింట్ నెన్స్ ఇతరత్రా పేర్లతో పార్కింగ్ చార్జీలను దొడ్డిదారిన రప్పించాలని ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
రోజుకు నాలుగు షోలు, వందల థియేటర్లు అంటే నెలకు కోట్లలో వుంటుంది ఆదాయం. అందుకే ఇండస్ట్రీలోని ఓ బలమైన వర్గం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అన్నది అనుమానం.