ఎప్పుడో కానీ మనసు విప్పి మాట్లాడని పవన్‌కళ్యాణ్ ‘గోపాల గోపాల’ ఆడియో వేడుకలో మాత్రం మనస్ఫూర్తిగా మాట్లాడేసాడు. ఎప్పుడూ తన సినిమాల ఫలితాల గురించి ఏమీ పట్టనట్టు ఉండే పవన్‌కళ్యాణ్ తనని కూడా ఒక దశలో పరాజయాలు వేధించాయని చెప్పేసాడు. అదలావుంచితే పవన్‌కళ్యాణ్ ముఖ్యంగా చిరంజీవి పేరుని పదే పదే ప్రస్తావించడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది.
అన్నయ్య ఊసెత్తకుండా ఉపన్యాసాలు ముగించేస్తోన్న పవన్‌కళ్యాణ్ యథాలాపంగా చిరంజీవి గురించి మాట్లాడాడని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తను మాట్లాడిన దాంట్లో ఏదీ అక్కడి వేడుకకి కానీ, సందర్భానికి కానీ సంబంధించినది కాదు. ముకుంద ఆడియో వేడుకలో పవన్‌కళ్యాణ్ లేకపోవడం మెగా అభిమానులని బాగా బాధ పెట్టింది. చిరంజీవి కూడా ఆ వేడుకలో ‘తమ్ముడి విషయాన్ని ఇక పట్టించుకోవడం అనవసరం’ అన్నట్టు మాట్లాడేసాడు.
అది కాకుండా మెగా అభిమానుల్లో క్లియర్ డివైడ్ కనిపిస్తోంది. చిరంజీవి వీరాభిమానులంతా ఒక వైపు, పవన్‌కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఫాన్స్ ఒకవైపు అయిపోయారు. సదరు ఎక్స్‌క్లూజివ్ పవర్ ఫాన్స్ ఆడియో ఫంక్షన్స్‌కి వెళ్లి ఎవరినీ మాట్లాడనివ్వకుండా హడావుడి చేస్తున్నారు. తమ బలం చాటుకునే ప్రయత్నంలా అది కనిపిస్తోంది. ఇదంతా గమనిస్తోన్న పవన్‌కళ్యాణ్ దాని గురించి డైరెక్టుగా మాట్లాడకుండా ఇలా అన్నయ్యతో తనకి ఉన్న అనుబంధాన్ని చాటుకుని అన్నిటికీ ఒకేసారి ఫుల్‌స్టాప్ పెట్టాడేమో అనిపిస్తోంది. పవన్ ఆంతర్యం ఏమైనా కానీ ఈ స్పీచ్ మాత్రం మెగా ఫాన్స్‌కి ఉత్సాహాన్ని కలిగించి… అంతా ఒక్కటి కావడానికి బీజం వేసింది.