పద్మభూషణ్‌.. నాకెందుకు ఇవ్వరు.?

పద్మ పురస్కారాలు రోజురోజుకీ వివాదాస్పదమవుతున్నాయి. చాలాకాలంగా పద్మ పురస్కారాలపై వివాదాలున్నా.. ఈసారి తలెత్తుతున్న వివాదాలు భవిష్యత్తులో పద్మ పురస్కారాల గౌరవాన్ని మరింత తగ్గించేస్తాయేమోనన్న ఆందోళన నెలకొంది. అయినా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకే…

పద్మ పురస్కారాలు రోజురోజుకీ వివాదాస్పదమవుతున్నాయి. చాలాకాలంగా పద్మ పురస్కారాలపై వివాదాలున్నా.. ఈసారి తలెత్తుతున్న వివాదాలు భవిష్యత్తులో పద్మ పురస్కారాల గౌరవాన్ని మరింత తగ్గించేస్తాయేమోనన్న ఆందోళన నెలకొంది. అయినా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకే వివాదాలు తప్పనప్పుడు, ఆ తర్వాతి స్థానంలో వున్న పద్మ పురస్కారాలకు వివాదాల్లేకుండా ఎలా వుంటాయి.?

గతంలో పద్మ పురస్కారాలు లేదా భారతరత్న పురస్కారాల్ని అందుకున్నవారి విషయంలో వివాదాలు వచ్చేవి. ఫలానా వ్యక్తికి భారతరత్న అయినా పద్మ పురస్కారమైనా ఎలా ఇస్తారు.? అనే అంశం చుట్టూ వివాదాలు, చర్చలు జరిగేవి. ఇప్పుడు తలెత్తుతున్న వివాదాలు వాటికి పూర్తి భిన్నం. పద్మ పురస్కారాల్ని ఆశిస్తున్నవారు మాకెందుకు ఇవ్వరు.? అని ప్రశ్నిస్తున్నారు. క్రీడా రంగం నుంచి తాను పద్మ పురస్కారాన్ని ఆశిస్తున్నాననీ, పద్మభూషణ్‌ పురస్కారానికి తన పేరు నామినేట్‌ చేయకపోవడం ఆవేదన కలిగిస్తోందని ఇటీవలే క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఆవేదన వ్యక్తం చేయడం, కేంద్రం స్పందించి ఆమె పేరును సిఫారసు చేయడం జరిగాయి.

సైనా నెహ్వాల్‌ని స్ఫూర్తిగా తీసుకుని బాక్సర్‌ విజయేందర్‌సింగ్‌ తనకూ పద్మభూషన్‌ కావాలంటూ డిమాండ్‌ చేశాడు. 2008లో జరిగిన ఒలింపిక్స్‌లో విజేందర్‌ కాంశ్య పతకం సాధించడమే కాక, దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్‌ సంపాదించాడు. ఆ పతకంతో విజేందర్‌సింగ్‌ చాలామందికి రోల్‌మోడల్‌ అయ్యాడు. అయినాసరే, ఇలా రచ్చకెక్కడం తగునా.? అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ప్రతిభావంతులకు పురస్కారాలు ఇవ్వడం ద్వారా వారిని గౌరవించుకున్నట్లవుతుంది, తద్వారా ఆయా పురస్కారాలకీ కొత్త గౌరవం వచ్చి చేరుతుంది. అదే సమయంలో అడిగి తెచ్చుకునే పురస్కారాలకు విలువ వుండదు. రాజకీయ పెత్తనాలతో పద్మ పురస్కారాలకు ఇప్పటికే మకిలి అంటించేశారు కొందరు. ఇప్పుడేమో, పురస్కారాల కోసం డిమాండ్లు వస్తున్నాయి. అంతా కలికాలం మహిమ అనుకోవాలేమో.!