పవన్ సినిమాలకు నైజాం..నో..నో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇక నైజాం..నై..నై..అంటుందా? అధికారికంగా అలా అనే అవకాశం లేదు కానీ, మొత్తానికి పవన్ సినిమాలను నైజాంలో తొక్కేసే అవకాశం కనిపిస్తోంది. పవన్ పై కెసిఆర్ చాలా గరం…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇక నైజాం..నై..నై..అంటుందా? అధికారికంగా అలా అనే అవకాశం లేదు కానీ, మొత్తానికి పవన్ సినిమాలను నైజాంలో తొక్కేసే అవకాశం కనిపిస్తోంది. పవన్ పై కెసిఆర్ చాలా గరం గరంగా వున్నట్లు భోగట్టా. ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి, కెసిఆర్ ను, ఆయన సంబంధీకులను డైలాగులతో చీల్చి చెండాడేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కెసిఆర్ మరిచిపోలేదని, ఇటీవల తనను కలిసిన తెలంగాణ నిర్మాతల వద్ద, అందుకు సంబంధించి నిష్టూరంగా మాట్లాడారని వినికిడి. 

పవన్ సినిమాలు గతంలో తెలంగాణ వద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొమరం పులి టైటిల్ లోంచి కొమరం అన్న పదం తీసే దాకా ఊరుకోలేదు. అలాగే కెమేరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ నోట తెలంగాణ వ్యతిరేక కామెంట్ లు వచ్చాయి. దానిపై కూడా నానా రభస జరిగింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ చాలా రకాల రిమార్కులు చేసారు. ఓ పక్క తెలంగాణ ఏర్పాటును అటు ఇటు కాకుండా సమర్థిసూ కూడా పవన్ కేసిఆర్ ను, కవితను టార్గెట్ చేసారు. డబ్బులు వసూలు చేసారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఉద్యమం కోసం చనిపోయిన వారిని పట్టించుకోదని జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. 

ఇప్పుడు వీటన్నింటి ప్రభావం సహజంగానే పవన్ సినిమాలపై వుండే అవకాశం వుంది. నిజంగా కేసిఆర్ తలుచుకుంటే సినిమాలు విడుదల కావడం కష్టమే. సినిమాలు కొనేవారు, కేసిఆర్ కు ఇష్టం లేదని తెలిస్తే ముందుకు రారు. వచ్చినా కేసిఆర్ తెరవెనుక ఓ మాట చెప్పినా, సినిమా థియేటర్ల నుంచి లేచిపోతుంది. అదీ కాదు అంటే పైరసీ సీడీలు హల్ చల్ చేసినా పట్టించుకునే నాధుడు వుండడు. 

నిజానికి ప్రభుత్వం కానీ, కెసిఆర్ కానీ అధికారికంగా, ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోయినా, తెరవెనుక సవాలక్ష రాజకీయాలు చేయచ్చు. ఎన్టీఆర్ తన వేషం వేసి, తనను వెక్కిరించాడని, ప్రదీప్ శక్తిని ఫీల్డ్ లో లేకుండా చేయగలిగారు. తనను విమర్శించాడని నరసింహరాజు కు సినిమాలు లేకుండా చేయగలిగారు. నైజాం అన్నది పవన్ కే కాదు, తెలుగు హీరోలందరికీ కాస్త కీలకమైన ప్రాంతం. అక్కడ వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. అందువల్ల పవన్ మొదటి సభకు, తరువాతి సభలకు, సీమాంధ్రకు, తెలంగాణకు మార్చి మార్చి మాట్లాడినట్లే, మరోసారి మాట మార్చి,..'ఆయనంటే నాకు గౌరవమే..చాలా మంచోడు..ఓ సారి కలిసాం.. ' ఇలాంటి సినిమా డైలాగులు అవలీలగా చెప్పేసి, కెసిఆర్ ను ప్రసన్నం చేసుకునే పని చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.