పవన్-త్రివిక్రమ్ సినిమా బడ్జెట్ వంద కోట్లు. ఇది అంచనా మాత్రమే. పూర్తి అయ్యేసరికి ఎంత అదనం అవుతుందన్నది తెలియదు. ఈ సినిమా సినిమాటోగ్రఫీకి, విజువల్ ఎఫెక్ట్ లకు, సెట్ లకే సింహభాగం బడ్జెట్ కేటాయించేసారట.
సినిమాటోగ్రాఫర్ మణికందన్ ను ఈ సినిమాకు తీసుకోవడం వెనుకే ఈ విషయాలు అన్నీ వున్నాయట.
ఇండియాలో ఒకే ఒక దగ్గర వున్న సినిమాటోగ్రఫీ ఎక్విప్ మెంట్ ను తెచ్చి ఈ సినిమా కోసం వాడుతున్నారు. ఒక సినిమాటోగ్రఫీకే అన్ని రకాల ఖర్చులు కలిపి అయిదు కోట్లకు పైగా అవుతుందని అంచనా అంట.
ఇక ఈ సినిమా కోసం చాలా భారీ సెట్ లు వేస్తున్నారట. ఇటీవల ఫిల్మ్ సిటీలో కోటిన్నర ఖర్చుతో ఓ టెర్రస్ సెట్ వేసారట. దుబాయ్ లో బోలెడు అంతస్తుల పైన వుండే టెర్రస్ సెట్ లాంటిదట. అందుకోసం కొన్ని అడుగుల ఎత్తున భారీ సెట్ వేసి, దాని చుట్టూ గ్రీన్ మాట్ పెట్టి, విజువల్ ఎఫెక్ట్ లు జోడిస్తారట.
అలాగే మరో కోటిన్నరతో వేర్ హవుస్ సెట్ వేసారట. ఇది మామూలు గిడ్డంగిలా కాకుండా విదేశాల్లో వుండే వేర్ హవుస్ ల మాదిరిగా భారీగా నిర్మించారట. దీనికి కూడా కోటికి పైగా ఖర్చయింది. అలాగే హీరో ఆఫీసు సెట్ ను కూడా ఫిల్మ్ సిటీలో కోట్ల రూపాయిల ఖర్చుతో వేసారు. ఈ ఆఫీసులోనే చాలా షూట్ వుంటుందట. ఈ ఆఫీసు గ్రౌండ్ లో వేసినా, సిజి వర్క్ ద్వారా చాలా పై అంతస్తులో వున్న ఫీల్ తీసుకువస్తారట.
విక్రమ్ కుమార్ 24 సినిమాకు పనిచేసిన ముంబాయి సంస్థ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ లు అందిస్తోందట. బాహుబలి తరువాత ఆ రేంజ్ విజువల్ ఎఫెక్ట్ లు ఈ సినిమాలో వుంటాయని టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లు అంటున్నారు కానీ, మరో పదికి పైగానే అవుతుందని టాక్ వినిపిస్తోంది.