ఓ సినిమాకు ఫస్ట్ లుక్ ఇవ్వాలన్నా, లేదా సమ్ థింగ్ స్పెషల్ తో బజ్ కు శ్రీకారం చుట్టాలన్న టైటిల్ కీలకం. పవన్ – త్రివిక్రమ్ సినిమాకు అదే సమస్యగా మారింది. సరైన టైటిల్ ఫిక్స్ కాలేదు. త్రివిక్రమ్ టైటిల్ చెప్పేవరకు ప్రెజర్ చేసేంత సీన్ హారిక హాసినిలో కానీ, అటు హీరో వైపు నుంచి కానీ వుండదు. ఇలాంటి టైమ్ లో పవర్ స్టార్ బర్త్ డే వస్తోంది. మరి అలాంటపుడు ఫ్యాన్స్ సహజంగా ఏదో ఒకటి ఆశిస్తారు. కానీ ఏం ఇవ్వాలి?
అందుకే మ్యూజిక్ బిట్ లాంటిది ఏదైనా ఇచ్చి, అదే గిఫ్ట్ ఫ్యాన్స్ కు అందిద్దాం అనుకున్నారు. కానీ పవర్ స్టార్ కు యూనిట్ తరపున అభినందనలు తెలుపుతూ ప్రకటనలు అయినా ఇవ్వాలి కదా? మరి ఏం స్టిల్స్ వాడతారు? పాతవి వాడితే బాగుండదు. కొత్తది వాడితే ఫస్ట్ లుక్ అనాల్సి వస్తుంది. మరి టైటిల్ లేని ఫస్ట్ లుక్ ఏమిటి?
సరే ఇంతకీ ఏదో ఒకటి డిజైన్ చేసి, ప్రకటనల కింద ముందురోజు పత్రికా సంస్థలకు, వెబ్ ఆర్గనైజర్లకు అందిస్తే, అది ఇట్టే బయటకు వచ్చేసి, హడావుడి అయిపోతుంది. అందుకే అప్పటికప్పుడు ఆలోచించి, కాన్సెప్ట్ లుక్ అనే కొత్త పదం సృష్టించి, దాన్నే లుక్ గా, దాన్నే ప్రకటనలుగా వదలాలని డిసైడ్ అయ్యారు. టైటిల్ కనుక ఫిక్స్ అయివుంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావేమో?