'జగన్ పాలన బాగుంటే నేను వెళ్లి హాయిగా సినిమాలు చేసుకుంటా' అని చటుక్కున అనేసారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్.
ఇప్పుడు ఆయన పింక్ అనే రీమేక్ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే పట్టుకుంటున్నారు వైకాపా జనాలు. జగన్ పాలన బాగుంది అని అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు.
మంత్రి బాలినేని అప్పుడే ఈ మేరకు ఓ స్టేట్ మెంట్ పడేసారు. జగన్ పాలన బాగుంది కాబట్టే, అన్న మాట ప్రకారం పవన్ సినిమా చేయబోతున్నాడని ఆయన అన్నారు.
ఇప్పుడు పవన్ కు ధర్మసంకట స్థితి. సినిమా చేస్తే ఓ బాధ, చేయకుంటే మరో బాధ. నిజానికి పవన్ ను సినిమాలు చేయవద్దని ఎవ్వరూ అనలేదు. ఆయన అంతట ఆయనే 'నేను కోట్ల ఆదాయం ఇచ్చే సినిమాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చా' అంటూ పదే పదే డప్పేసుకున్నారు. అంతే కాదు, ఇక సినిమాలు చేయను కాక చేయను అని పదే పదే ఆయనే చెప్పారు. లిఖితపూర్వకంగా, అధికారికంగా స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఇప్పుడు ఆయనే, జగన్ వ్యాపారాలు మానేసారా? అవంతి శ్రీనివాస్ మానేసారా? తానెందుకు మానాలి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. చాలా తెలివిగా. నిజానికి పవన్ ను ఎవ్వరూ మానమని అనలేదు. ఆయనే మానేసారు. మానేసానని డప్పేసారు. తిరిగి ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు.
ఇలాంటి టైమ్ లోనే మాట జారి, జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా అని అని తొందరపడి అనేయడం వల్ల ఇప్పడు మరోసారి సినిమాలు చేయకుండా వుండడానికి ఆయనకు ఆయనే కారణం అవుతున్నారేమో?