ఆర్టీసీ వివాదంపై ఈరోజు హైకోర్టులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంటుందని అంతా ఊహించారు. ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, సంస్థ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరిస్తుందని అంతా భావించారు. కానీ ఈరోజు కూడా ఈ పంచాయతీ తెగలేదు. సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఫలితంగా ఈ విచారణను శుక్రవారానికి వాయిదావేసింది కోర్టు.
విచారణ సందర్భంగా మరోసారి ప్రభుత్వానికి క్లాసు పీకింది కోర్టు. మరీ ముఖ్యంగా ఇన్ని అబద్ధాలు చెప్పే అధికారుల్ని ఎక్కడా చూడలేదంటూ.. ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, నిధుల మంజూరుకు సంబంధించి మొదట ఇచ్చిన నివేదికకు, రెండో నివేదికకు మధ్య ఉన్న భారీ అంతరాన్ని ప్రశ్నించిన కోర్టు.. ఇంత నిర్లక్ష్యంగా అఫిడవిట్లు దాఖలుచేస్తే ఎలా అని ప్రశ్నించింది.
దీనికి తోడు ఈరోజు జరిగిన వాదోపవాదాల్లో మరో కొత్త మెలిక పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. టెక్నికల్ గా ఆర్టీసీ విభజన విభజన చట్టంలోని షెడ్యూల్ 9 కిందకు వస్తుందని, కానీ తాము సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీని ఏర్పాటుచేశామని చెప్పుకొచ్చింది. దీంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అసలు టీఎస్ఆర్టీసీకి గుర్తింపు ఉందా లేదా అని ప్రశ్నించింది. ఓవైపు విభజన పెండింగ్ లో ఉండగా, మరోవైపు టీఎస్ఆర్టీసీని ఎలా ఏర్పాటుచేశారని గట్టిగా ప్రశ్నించింది.
సమ్మెపై చర్చ జరిగి సమస్య కొలిక్కి వస్తుందని భావిస్తే, ఇలా చర్చ మొత్తం పూర్తిగా పక్కదారి పట్టింది. అయితే సమ్మెకు సంబంధించి కోర్టు మాత్రం కీలక వ్యాఖ్య చేసింది. మధ్యేమార్గంగా రాజీ కుదర్చడానికి కోర్టు సిద్ధంగా ఉందని, కానీ అటు ప్రభుత్వం ఇటు కార్మికులు ఎవ్వరూ చొరవ చూపడం లేదని కామెంట్ చేసింది. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో కార్మికులకు ఊరటనిచ్చే అంశం ఒకటి దొరికింది. ఆర్టీసీ అనేది రాజ్యాంగపరంగా ఇంకా విభజన కాలేదు కాబట్టి, సీఎం కేసీఆర్ చెబుతున్నట్టు మిగతా 50శాతాన్ని కూడా ప్రైవేటుపరం చేయడం ఆయన వల్ల కాదు.