అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకుంటున్నవన్నీ సంచలన, సాహసోపేత నిర్ణయాలే. అమలు చేసే ధైర్యం, అమలయ్యాక వచ్చే ఫలితాలపై నమ్మకం ఉంది కాబట్టే ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి స్థిర అభిప్రాయంపై ఉంటున్నారు. అలాంటి సాహసోపేత నిర్ణయమే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం.
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెడతారు, తెలుగు ఒక సబ్జెక్ట్ గానే ఉంచుతారు. ఆ తర్వాత విడతలవారీగా పదో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని కొనసాగిస్తారు. ఇదేదో తప్పుడు నిర్ణయమైపోయినట్టు, దీంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సమూలంగా నాశనమైపోయినట్టు సోకాల్డ్ మేధావులు మొసలి కన్నీరు కారుస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా దీన్ని రాద్ధాంతం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఆంగ్ల ప్రదేశ్ గా మారిపోయిందంటూ గగ్గోలు పెడుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను ప్రముఖంగా ప్రచురిస్తూ రచ్చలేపుతోంది.
ఇంతకీ ఆంగ్లమాధ్యమంపై వీరికి ఎందుకింత అక్కసు. గొంతు చించుకుని అరుస్తున్న వీరిలో ఎంతమంది తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివిస్తున్నారు. మన పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకి వెళ్లాలి, పేదలు వెళ్లే ప్రభుత్వ బడుల్లో మాత్రం తెలుగు మీడియమే చెప్పాలి. ఇదెక్కడి లాజిక్, ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే పక్షపాత వైఖరి ఇంకోటి ఉంటుందా. ఇంగ్లిష్ మీడియంతో ఏం లాభం అంటూ ప్రశ్నిస్తున్న మేథావులంతా ఒక్కసారి కాంపిటీటివ్ యుగంపై దృష్టిసారించడం మంచిది.
నిరుపేద కుటుంబాల పిల్లలు పదో తరగతి వరకు అందుబాటులో ఉన్న తెలుగు మీడియంలో చదువుకుంటారు, ఆ తర్వాత ఇంటర్, ఇంజినీరింగ్, లేదా డిగ్రీ, పీజీతో పరిస్థితి మారిపోతుంది. ఒక్కసారిగా ఆంగ్లమాధ్యమంలోకి రావాలంటే వారికి కష్టం. అందుకే ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతూ పేద కుటుంబాలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నారు జగన్. దీనివల్ల లబ్ధిపొందేది నిరుపేద కుటుంబాలే. వద్దు వద్దు అంటూ వారించేది మాత్రం తమ పిల్లల్ని సర్కారు బడికి పంపించని కుహనా మేథావులే.
కాంపిటీటివ్ పరీక్షల్లో తెలుగు ఎంత అపహాస్యం అవుతుందో వేరే చెప్పక్కర్లేదు. ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి ప్రశ్నల్ని, జవాబుల్ని తర్జుమా చేసే క్రమంలో సవాలక్ష తప్పులు. ఇలాంటి పరిస్థితులు కచ్చితంగా ఇంగ్లిష్ మీడియం వారికి మేలు చేస్తున్నాయి. మరి ఉద్యోగాలు తెచ్చిపెట్టలేని తెలుగు మీడియం పేదపిల్లలకి అవసరమా. తెలుగు చచ్చిపోతోంది, చచ్చిపోతోంది అని గగ్గోలు పెట్టే ఈనాడు సంస్థకి చెందిన ఓ స్కూల్ పూర్తిగా ఇంగ్లిష్ మీడియంతో నిండిన కార్పొరేట్ వ్యవస్థ. చెప్పేది తెలుగు మీడియం నీతులు, పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు పంపిస్తారా. ఇంకా ఎంతకాలం పేదలకు ఇంగ్లిష్ మీడియంను దూరం చేస్తారు, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఎందుకు అంత ఇదిగా వ్యతిరేకిస్తారు?
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తే తెలుగు చచ్చిపోదు, ప్రపంచం తలకిందులవదు. పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా నాలుగు ఇంగ్లిష్ అక్షరం ముక్కలు నేర్చుకుంటారు. తమ ఉపాధికి బంగారు బాట వేసుకుంటారు. ఇకనైనా మేధావులు అని చెప్పుకునే వ్యక్తులు, విలువలు అని చెప్పుకునే మీడియా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. పిల్లలకు ఏం అవసరమో గుర్తించాలి.