తగ్గని శివసేన.. రిసార్ట్ పాలిటిక్స్ షురూ!

తాము పట్టిన పట్టును వీడటం లేదు శివసేన. ముఖ్యమంత్రి పీఠాన్ని తొలి రెండున్నరేళ్లూ తమకే అప్పగించాలని బీజేపీ దగ్గర మద్దతు విషయంలో షరతు విధించిన సేన.. ఆ విషయంలో గట్టిగా పట్టుపట్టింది. ముఖ్యమంత్రి పీఠం…

తాము పట్టిన పట్టును వీడటం లేదు శివసేన. ముఖ్యమంత్రి పీఠాన్ని తొలి రెండున్నరేళ్లూ తమకే అప్పగించాలని బీజేపీ దగ్గర మద్దతు విషయంలో షరతు విధించిన సేన.. ఆ విషయంలో గట్టిగా పట్టుపట్టింది. ముఖ్యమంత్రి పీఠం తమదేనని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇలా ఇరు పార్టీలూ తెగే వరకూ లాగుతూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ  వాళ్లు రాష్ట్రపతి పాలన అంటూ లీకులు ఇస్తున్నారు. శివసేనను బెదిరించడానికే ఈ లీకులు ఇస్తున్నారని స్పష్టం అవుతోంది. ఈ నెల తొమ్మిదో తేదీతో మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. దీంతో రేపటిలోగా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏదో ఒకటి తేలాల్సి  ఉంది.

ఈ నేపథ్యంలో శివసేన తాము ఏ మాత్రం తగ్గలేదని సంకేతాలు ఇస్తూ ఉంది. అంతేగాక  తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆ పార్టీ వారిని రిసార్టుకు తరలిస్తూ ఉందని వార్తలు వస్తున్నాయి. శివసేనను చీల్చడానికి బీజేపీ వెనుకాడకపోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. 

ఇక సీనియర్ నేత నితిన్  గడ్కరీ మాట్లాడుతూ.. తనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదని ప్రకటించారు. తను ఢిల్లీ రాజకీయాలకే పరిమితం కావాలని అనుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు.
శివసేన రాజీకి వస్తుందని, బీజేపీకే మద్దతు పలుకుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయంలో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదని ఆయన చెప్పుకొచ్చారు!