నటులంటే ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నిస్తూ ఉంది నటి రష్మిక మందనా. ఒక ట్రోల్ పేజ్ వాళ్లు తనను దూషిస్తూ, తనకు ఎఫైర్ ను అంటగడుతూ పోస్టు పెట్టడంపై రష్మిక తీవ్రంగా స్పందించింది. తామెందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నామంటూ ఆమె ప్రశ్నించింది.
నటుడు విజయ్ దేవరకొండతో రష్మికకు ఎఫైర్ ను అంటగడుతూ, కొన్ని వల్గర్-బూతు కామెంట్స్ ను జోడిస్తూ.. ఒక ట్రోల్ పేజ్ వాళ్లు పోస్టు చేసిన పిక్ ను రష్మిక షేర్ చేసింది. అందులో రష్మిక చిన్నప్పటి ఫొటోలను కూడా వాడుకుని.. ఆమెను అసభ్యంగా దూషించారు. అత్యంత తీవ్రంగా ఉంది ఆ పోస్టు.
ఎవరో అనామకులే అలాంటి పని చేసినా.. రష్మిక వారిని వదల్లేట్టుగా లేదు. దాన్ని షేర్ చేసి తన ఆవేదనను తెలిపింది. అలాంటి పోస్టు పెట్టిన వారిపై ఫైర్ అయ్యింది. ఏ మాత్రం జాలి-దయ లేకుండా హార్ట్ చేయడమే లక్ష్యంగా ఇలాంటి పోస్టులను పెడుతూ ఉన్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
ఇన్నాళ్లూ అలాంటి నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోవద్దని అనేక మంది సూచించారని, తను కూడా అందుకు తగ్గట్టుగా ఉన్నట్టుగా చెప్పింది. అయితే ఎవరికీ మరొకరిని వ్యక్తిగతంగా-ఫ్యామిలీలను దూషించే హక్కు లేదనే విషయాన్ని రష్మిక ప్రస్తావించింది. ఇందుకు తగిన పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని కూడా రష్మిక హెచ్చరిక జారీ చేసింది.