పవన్, మహేశ్, ఎన్టీఆర్.. సేమ్ సెంటిమెంట్!

ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు పెద్ద ప్రాధాన్యతనే ఉంటుంది. అలాంటి సెంటిమెంట్లను ఫాలో కావడానికి అనేక మంది తెగ తాపత్రయ పడిపోతూ ఉంటారు. ఈ తాపత్రయంలో కొన్ని సార్లు సెంటిమెంట్లను యథాతథంగా అనుసరించి హిట్స్ కొడుతూ ఉంటాయి.…

ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు పెద్ద ప్రాధాన్యతనే ఉంటుంది. అలాంటి సెంటిమెంట్లను ఫాలో కావడానికి అనేక మంది తెగ తాపత్రయ పడిపోతూ ఉంటారు. ఈ తాపత్రయంలో కొన్ని సార్లు సెంటిమెంట్లను యథాతథంగా అనుసరించి హిట్స్ కొడుతూ ఉంటాయి. మరి కొన్ని సార్లు ఈ సెంటిమెంట్లు కలిసి రాకపోవచ్చు. రెండక్షరాల పేరుతో వచ్చిన తన సినిమాలు హిట్టవుతుండటంతో గోపీచంద్ వరసగా అదే పేర్లతో సినిమాలు తీశాడు. ఇటీవలే సౌఖ్యం సినిమాతో గోపీకి ఆ సెంటిమెంట్ కాస్తా యాంటీగా మారింది. అలాగే మూడు అక్షరాల సినిమాలో మహేశ్ విన్యాసాలు చేశాడు. కలిసొస్తోంది అనుకున్న  ఆ సెంటిమెంట్ అతిథి సినిమాతోనే బ్రేక్ పడింది

. ఇండస్ట్రీలోని ప్రముఖులకు సంబంధించి బయటకు వెళ్లడయ్యే సెంటిమెంట్లు అతి తక్కువ. ఒక హీరోకి తన ప్రతి సినిమా విడుదల రోజూ.. తన పాత షర్ట్ ఒకటి వేసుకుని ఆ సినిమాను థియేటర్లో చూసే అలవాటుంది. అల్లుఅర్జున్‌కు కుర్చీ సెంటిమెంట్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తను ఎక్కడికి వెళ్లినా తన పనివారితో తన కుర్చీని మోయించుకుని వెళ్లినట్టుగా.. చివరకు ఢిల్లీకి వెళ్లినా ఆ కూర్చి లోనే కూర్చోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా.. అల్లుఅర్జున్‌కు కూడా కుర్చీ సెంటిమెంట్ ఉందట. షూటింగ్ స్పాట్‌కు ఇతర తన సినిమాలకు సంబంధించిన వర్క్‌కు హాజరవుతున్న సమయంలో అల్లు వారబ్బాయి ఒకే కుర్చీని వేయించుకొంటాడట. దాన్ని ఇంటి నుంచి తన అసిస్టెంట్లతో తెప్పించుకోవడం అల్లుఅర్జున్ అలవాటు.

మరి ఇలా కావాలని సెంటిమెంట్ల గురించి పాటించే వాళ్ల సంగతి అంటుంచితే.. అనుకోకుండా కలిసి వచ్చే సెంటిమెంట్లు కొన్ని ఉంటాయి. యాధృచ్ఛికంగా జరిగిపోయే ఇవి ఆశ్చర్యపరుస్తాయి. అలాంటిదే ప్రస్తుతం టాలీవుడ్‌లో తొలి స్థానం కోసం పోటీలో ఉన్న ముగ్గురి హీరోల మధ్య కొన్ని సంవత్సరాల కిందటే జరిగింది. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు.. అటు ఇటుగా కొన్ని సంవత్సరాలు మాత్రమే తేడాగా హీరోలుగా కెరీర్ మొదలుపెట్టిన ఈ హీరోల మధ్య పోలిక వీరి ఏడో సినిమా గురించి. అదేమిటంటే… పవన్‌కల్యాణ్ ఏడో సినిమా.. ‘ఖుషీ’. మహేశ్ బాబు హీరోగా కెరీర్ పారంభించాకా చేసిన ఏడో సినిమా ‘ఒక్కడు’ సంచలన రీతిలో విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఏడో సినిమా ‘సింహాద్రి’. ఈ ముగ్గురు హీరోల జీవితంలో మరిచిపోలేని సినిమాలివి. ఈహీరోల అభిమాలనులను అమితంగా ఆనందపెట్టే సినిమాలు ఇవి. మరి ఈ హీరోలు ముగ్గురూ తమ కెరీర్‌లో సంచలన విజయాన్ని అందుకున్నది ఏడో సినిమాతోనే కావడం విశేషం.

మరి మరింత విశేషం ఏమిటంటే.. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్ ఒకరే కావడం. ఖుషీలో ఉన్నది భూమిక, ఒక్కడో మహేశ్ సరసన మెరిసినది ఈ ఛావ్లానే, ఎన్టీఆర్ సింహాద్రిలో కూడా మెయిన్ హీరోయిన్ పాత్ర చేసింది భూమికనే! ఈ విధంగా ముగ్గురు హీరోలతో హిట్స్‌ను కొట్టింది ఈ హీరోయిన్. కచ్చితంగా ఇది యాధృచ్చికంగా జరిగినదే. వేరు వేరు సమయాల్లో తమ ఏడో సినిమాను చేసిన పవన్, మహేశ్, ఎన్టీఆర్‌లు కావాలని ఏమీ భూమికను హీరోయిన్‌గా తీసుకుని ఉండరు. ఏదో యాధృచ్ఛికంగా జరిగిందంతే.

మరి ఏడో సినిమా సంగతి ఉంటే.. ఆ సినిమాతో సంచలనాలను నమోదు చేసిన ఈ హీరోలు ఎనిమిదో సినిమాతో మాత్రం గుడ్లు తేలేశారు. ఏడో సినిమా హిట్‌తో ప్రతిష్టాకంగా వచ్చిన వీరి ఎనిమిదో సినిమాలు ఫట్ మన్నాయి. ఏడో సినిమాతో ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హిట్లు కొట్టిన వీళ్లు ఎనిమిదో సినిమాతో మాత్రం ఇండస్ట్రీలోనే చెప్పుకోదగ్గ ఫ్లాపులను ఎదుర్కొన్నారు. ఖుషీ తర్వాత పవన్ చేసిన సినిమా జానీ. ఇది ఏ విధంగా ప్రతిష్టాత్మకమో ఎందుకు ప్రత్యేకమో చెప్పుకొంటే పెద్ద కథే అవుతుంది. ఫలితం మాత్రం ఒకే మాట.. డిజాస్టర్. ఖుషీతో అద్భుతం సాధించిన పవన్ జానీతో అనామకుడు అయ్యాడు. 

ఇక తర్వాత ఏడో సినిమాతో హిట్ కొట్టిన ‘ఒక్కడు’ ఎనిమిదో సినిమాతో మాత్రం అనామకుడిగా మిగిలాడు. మహేశ్ హీరోగా నటించిన ఎనిమిందో సినిమా ఒక కళాఖండం. అదే ‘నిజం’. ఆ సినిమా ఎంత డిజాస్టరో చెప్పడానికి దాని పేరు ప్రస్తావనే చాలు. ఇక ఇంతే వేడితో ఏడో సినిమాతో హిట్ కొట్టిన జూనియర్ తన ఎనిమిదో సినిమాను పవన్, మహేశ్‌లను మించి పోయేంత స్థాయి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చాడు. అంతే తీవ్రస్థాయి ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నాడు. అలా ఎన్టీఆర్ విషయంలోనూ సేమ్ సెంటిమెంటును రిపీట్ చేసి అమ్మో అనిపించిన బొమ్మ ‘ఆంధావాలా’.

మరి ఏడో సినిమా హిట్‌తో.. అందులో భూమికను హీరోయిన్‌గా పెట్టుకొన్న నేపథ్యంతోనే గాక ఎనిమిదో సినిమాతో కూడా ఒకే ఫలితాన్ని మూటగట్టుకోవడం ఈ ముగ్గురి హీరోల మధ్య ఉన్న యాధృచ్ఛికమైన పోలిక!